నేరేడుచర్ల, నవంబర్ 8: మండలంలోని సోమారం గ్రామ పం చాయతీ పరిధిలోని మూసీ నదిలో ఓ బాలిక గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారం గ్రామానికి చెందిన కొమర్రాజు సుస్మిత (13) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో తాను తాయారు చేసిన మట్టి గణపతి విగ్రహాన్ని నిమజ్ఞనం చేసేందుకు అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న అశ్విని, దీక్షతతో కలిసి సోమప్ప ఆలయం సమీపంలోని మూసీ నది వద్దకు వెళ్లింది.
నిమజ్ఞం చేసే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో బాలిక కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న ఇరువురు బాలికలు పెద్దగా కేకలు వేయడంతో సమీప పొలాల్లో ఉన్నవారు వచ్చి చూడగా సుస్మిత జాడ కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుజూర్నగర్ సీఐ చరమందరాజు, నేరేడుచర్ల తాసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సుస్మితకు సోదరి, సోదరుడు ఉన్నారని, తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై తెలిపారు.