కోదాడ, సెప్టెంబర్ 25 : అప్పుసొప్పు వేల రూపాయలు పెట్టుబడి వరి సాగు చేస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటంతా ఊడ్చుకుపోయింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల ఒకటిన పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చకపోవడంతో రైతులకు అపార నష్టం జరిగింది. వర్షం, వరద కారణంగా రైతులను నష్టపోయిన దానికి మించి.. మరమ్మతుల కోసం సాగర్ కాల్వలకు నీటి విడుదల బంద్ చేయడంతో కోదాడ నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నెల ఒకటిన గండి పడితే 14వరకు కూడా మరమ్మతుల పనుల ప్రారంభం కాలేదు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నీటి విడుదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కోదాడ నియోజకవర్గంలో ఇటీవలి భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు సర్వే ద్వారా గుర్తించారు. అనంతగిరి మండలంలో 1,186 ఎకరాలు, చిలుకూరులో 905, కోదాడలో 1151, మోతెలో 1045, మునగాలలో 611, నడిగూడెం మండలంలో 201 ఎకరాల్లో మునకకు గురైనట్లు పేర్కొన్నారు. కాగా, సాగర్ కాల్వకు పడిన గండిని సకాలంలో పూడ్చకపోవడంతో ఎండిన పంటలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతుల ప్రారంభానికి రెండు వారాలు జాప్యం చేశారని, ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీరు వదిలినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని వాపోతున్నారు. కనీసం పెట్టుబడి వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారంపై ప్రభుత్వం స్పందించకపోవడం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంతోనే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని, అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోనే సాగర్ ఎడమ కాల్వ పడింది. గండిని సకాలంలో పూడ్చకపోవడంతో నీళ్లు అందక నియోజకవర్గవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట ఎండింది. మునిగిన పంటకు ప్రభుత్వమే బాధ్యత వహించి, రైతులు నష్టపోయిన ప్రతి ఎకరూ పరిహారం చెల్లించాలి.
-అనంతుల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకుడు, నడిగూడెం
20 రోజులుగా సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. నాకున్న నాలుగు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను. ఇటీవల భారీ వర్షాల కారణంగా సాగర్ ఎడమ కాల్వకు గండి పడడంతో నీళ్లు నిలిపివేశారు. దాంతో నా పొలం నీళ్లు లేక ఎండిపోయింది. కాల్వకు వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-గండు చిన్న లింగయ్య, రైతు, నడిగూడెం