నందికొండ, ఆగస్టు 10 : నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు పోటెత్తారు. శనివారం విద్యాసంస్థలకు సెలవు కావడంతో లక్ష మందికిపైనే తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి డ్యామ్ వద్ద కొత్త బ్రిడ్జి, జల విద్యుత్ కేంద్రం, శివాలయం పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ జల సవ్వడులను పర్యాటకులు వీక్షిస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నాగార్జునసాగర్ డ్యామ్, బుద్ధవనాన్ని సందర్శించారు.
3,55,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద వస్తున్నది. రిజర్వాయర్ నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ ప్రస్తుతం 588.00 (306.10 టీఎంసీలు) అడుగులు ఉన్నది. శ్రీశైలం నుంచి 3,55,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్‌కు కొనసాగుతుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలారు. శనివారం 16 గేట్లు 10 అడుగులు, 10 గేట్లు 5 అడుగుల ఎత్తి 3,12,756 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
శుక్రవారం 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,58,608 క్యూసెక్కులు విడుదల చేయగా, శనివారం అదనంగా 54,148 క్యూసెక్కుల నీటిని పెంచి దిగువకు వదిలారు. క్రస్ట్ గేట్లతోపాటు ఎడమ కాల్వ ద్వారా 8,367, కుడి కాల్వ ద్వారా 3,597, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,070, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. పర్యాటకులకు ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం భద్రతతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నది.
కనిపించని మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సేవలు
డ్యామ్ అందాలను తిలకించడానికి లక్షకు పైగా పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. కానీ పర్యాటకుల కోసం మున్సిపల్, రెవెన్యూ శాఖలు మంచి నీటి వసతులు, మెడికల్ క్యాంప్‌లు, అంబులెన్స్ వంటి సౌకర్యాలు కల్పించలేదు. మల, మూత్ర విసర్జనకు ఏర్పాట్లు చేయలేదు. దాంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న దవాఖానకు తరలించే లోపు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా స్థానిక అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. లాంచీ స్టేషన్ వద్ద నిరుపయోగంగా ఉన్న మొబైల్ టాయిలెట్‌ను డ్యామ్ పరిసరాల్లో అందుబాటులో ఉంచితే బాగుంటుందని చెబుతున్నారు.
టెయిల్‌పాండ్ 12 గేట్లు ఎత్తివేత
అడవిదేవులపల్లి : మండల కేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు శనివారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 3,41,785 క్యూసెక్కులు వచ్చిందని ఏఈ జైపాల్ తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లను 5.5 మీటర్లు ఎత్తి 3,41,340 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు వదిలారు. టెయిల్‌పాండ్ నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 6.121 టీఎంసీలు ఉన్నది.
లాంచీ ప్రయాణానికి బ్రేక్
నాగార్జున సాగర్ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి లాంచీలను నాగార్జున కొండకు, జాలీ ట్రిప్పులు నడుపడాన్ని శనివారం రద్దు చేశారు. సాగర్‌కు శ్రీశైలం నుంచి వరద భారీ స్థాయిలో వస్తుండడం, సాగర్ ఎర్త్ డ్యామ్ ఆనుకొని ఉన్న లాంచీ స్టేషన్ హైవే రోడ్డుకు సమీపంగా ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిలిపివేసినట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత లాంచీలను నడుపుతామని లాంచీ స్టేషన్ జీఎం ఇబ్రహీం తెలిపారు.
15 గేట్ల ద్వారా పులిచింతల నీటి విడుదల
చింతలపాలెం : పై నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.00(45.77 టీఎంసీలు) అడుగులకుగానూ రాత్రి 8 గంటల వరకు 168.239 (35.910 టీఎంసీలు) అడుగులు ఉన్నది. ఎగువ ప్రాంతాల నుంచి 3,29,932 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 15 గేట్ల నుంచి 3,09,932, జెన్కో గేట్ల నుంచి 16,000 క్యూసెక్కులు మొత్తం 3,25,932 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో వెళ్తున్నది. తెలంగాణ జెన్కోలో 16000 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్ల ద్వారా 80 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు.