నీలగిరి, డిసెంబర్ 01 : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన పెద్దవూర, హాలియా, పులిమామిడి గ్రామాల్లో సోమవారం ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి విభేదాలకు పోకుండా అంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎన్నికలు వచ్చిపోతుంటాయి, గ్రామంలో ఉండాల్సింది ప్రజలు, కావునా అందరూ కలిసి ఉండాలన్నారు. గత ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పటు చేసినట్లు చెప్పారు. మళ్లీ గొడవలకు కారకులైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో నగదు, మద్యం, ఉచిత పంపిణీలు లాంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, హాలియా సీఐ సతీశ్ రెడ్డి, హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్, పెద్దవూర ఎస్ఐ ప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Nilagiri : ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్