కేతేపల్లి, జూలై 11 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టానికి చేరువగా వచ్చింది. వేసవి ప్రారంభం నుంచే ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెల ప్రారంభానికే ప్రాజెక్టు నీటిమట్టం 640 అడుగులు దాటి పూర్తిస్థాయిలో నిండేందుకు చేరువగా వచ్చింది.
ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరడంతో వానాకాలం సీజన్లో నీటి విడుదలపై ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల రోజుల నుంచి వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో ఆయకట్టుకు నీటి విడుదలపై అధికారుల్లో సందిగ్ధం ఏర్పడింది. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 641.63 అడుగులుగా ఉంది. మరో మూడున్నర అడుగుల మేర నీటిమట్టం పెరిగితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది.
ఈ పరిస్థితుల్లో సీజన్ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా అధికారులు ఇంత వరకు ఆయకట్టుకు నీటి విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు గత యాసంగిలో సాగునీటిని నిలిపి వేసిన తర్వాత ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో భూగర్భ జలాలు తగ్గడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది. దీంతో ఆయా గ్రామాల్లో బావులు, బోర్లుకూడా ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉన్నతాధికారులు కల్పించుకొని కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నకిరేకల్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. కుడి కాల్వ పరిధిలో కేతేపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, వేములపల్లి మండలాల్లో 23 చెరువులు, ఎడమ కాలువ పరిధిలో సూర్యాపేట, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లో 22 చెరువులు ఉన్నాయి. కాలువలకు నీటిని విడుదల చేసినట్లయితే చెరువులు, కుంటలు పూర్థిస్థాయిలో నిండుతాయి. కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల ఎకరాల భూ ములు సాగులోకి రానున్నాయి. అంతే కాకుండా నీటి విడుదలతో పత్తి, వరి, ఇతర ఆరుతడి పంటలకు సైతం సాగునీరు అందుతుంది.
మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రం వరకు 641.63(3.60 టీఎంసీలు) అడుగులు ఉంది.ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగాం, తదితర ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి 68.78 క్యూసెక్కుల నీరే వచ్చినట్లు ఏఈ మధు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నీటి విడుదల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన ప్రతి ఏడాది వానాకాలం పంటల సాగుకు రైతుల అవసరాల మేరకు గతంలో నీటిని విడుదల చేశాం. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు లేనందున ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే ఆయకట్టుకు నీటి విడుదల తేదీలను ప్రకటిస్తాం.
బోర్లు, బావుల్లో నీటి మట్టం తగ్గడంతో నార్లు కూ డా సాదుకునే పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో నార్లు పోసుకున్నాం.మూసీ నీళ్లు వస్తేనే నార్లు సాదుకునేది. ఈ నీటితోనే పొలాలు దున్నుతాం. సీజన్ ప్రారంభం కావడంతో ప్రాజెక్టు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభు త్వం ఇప్పటి వరకు నీటి విడుదల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడి త్వరితగతిన నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం.
– రాచకొండ సైదులు గౌడ్, రైతు, కొత్తపేట, కేతేపల్లి మండలం