మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు ఇటీవలి పరిణామాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో స్థానం ఆశించిన రాజగోపాల్‌రెడ్డికి ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎం, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నెల 3న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు ఆయన బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కు వెళ్లి కలిశారు.
ఖర్గేతో భేటీ ఉన్నదనే సమాచారం తనకు తెలిసినా రాజగోపాల్‌రెడ్డి లైట్‌గా తీసుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని, ఈ లోగా పార్టీ అధిష్టానానికి కూడా తగినంత సమయం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. అప్పటికీ మంత్రి పదవిపై పార్టీ ఎటూ తేల్చకపోతే తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వ లేదా పార్టీ పెద్దలపై పోరాటం చేయడమా? లేదా ప్రత్యామ్నాయం చూసుకోవడమా? అన్నది తేల్చుకోవాలనే నిర్ణయానికి ఎమ్మెల్యే వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
– నల్లగొండ ప్రతినిధి, జూలై5(నమస్తే తెలంగాణ)
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అట్లనే కనిపిస్తున్నాయి. మొదటి నుంచి రాష్ట్ర కేబినెట్లో స్థానం ఆశిస్తూ వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరాశే మిగిలింది. గత నెల మొదటి వారంలో జరిగిన విస్తరణలోనూ ఆయనకు మొండిచెయ్యే చూపించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారు. తనకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరేటప్పుడు, తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నది ఆయన వాదన.
కానీ అది నేరవేరకపో వడంతో తనకు ఇచ్చిన మాట తప్పుతు న్నారంటూ పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వ పెద్దల తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎం, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమా లకు సైతం రాజ గోపాల్‌రెడ్డి దూరం గా ఉంటూ వస్తు న్నారు. తాజాగా ఏఐసీసీ అధ్య క్షుడు మల్లి కార్జున ఖర్గే హైదరా బాద్‌కు వచ్చినా రాజగోపాల్‌రెడ్డి అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఖర్గేతో భేటీ సమాచారం ఉన్నా అటు వైపు వెళ్లాలనుకోలేదని ఆయన సన్నిహితులు చెప్తున్న సమాచారం. ఇక మర్నాడు శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ పీఏసీ మీటింగ్‌తో పాటు అడ్వైజరీకమిటీ, పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతోనూ ఖర్గే సమావేశమయ్యారు. ఇక్కడా కూడా రాజగోపాల్‌రెడ్డి జాడ కనిపించలేదు. ఇక సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభకు సైతం రాజగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా పెద్దగా జనం హాజరుకాలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉండడం గమనార్హం. ఎల్బీ స్టేడియం మీటింగ్ వెళ్లాలని ఆయన ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. అలాగే ఉమ్మడి జిల్లాలో జరిగిన కీలక ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. నల్లగొండ, హుజూర్‌నగర్‌లో సీఎం పాల్గొన్న కార్యక్రమాలకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా వచ్చినా రాజగోపాల్‌రెడ్డి దూరంగానే ఉన్నారు.
ఈ నెల 2వ తేదీన నల్లగొండలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జరగ్గా, దీనికి తొలిసారిగా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వచ్చినా రాజగోపాల్ హాజరుకాలేదు. 18 నెలల ప్రభుత్వ కాలంలో ఇప్పటివరకు తన మునుగోడు నియోజకవర్గానికి ఒక్క మంత్రిని కూడా ఆయన ఆహ్వానించలేదు. తన సొదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సైతం అడుగుపెట్టనివ్వలేదు. రాజగోపాల్‌రెడ్డి పర్మిషన్ లేకుండా మంత్రులు, ఎంపీలు సైతం మునుగోడు వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చెయ్యడం లేదు. కేవలం తన నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తూ సంబంధిత విభాగాల అధికారులతో మాత్రం రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తన నియోజవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఏ శాఖ మంత్రిని కూడా ఆయన సంప్రదించడానికి ఇష్టపడడం లేదు. కేవలం అధికారులతో సమీక్షించడం, వారి ద్వారానే నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేనే మంత్రిని కావాల్సిన వాడిని… ఏ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం తనకు లేదన్న ధోరణిలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలి ఉంది. అసలు రాజగోపాల్‌రెడ్డి వ్యూహమేంటి.. భవిష్యత్తు అడుగులు ఎటూ పడనున్నాయి? అని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. మెల్లమెల్లగా ప్రభుత్వంతో పాటు పార్టీకి సైతం క్రమంగా దూరం జరుగుతున్నారన్న చర్చ ఊపుందుకుంది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలు ముగిసే వరకు మరో రెండు,మూడు నెలల సమయం పట్టవచ్చని, ఈ లోగా పార్టీ అధిష్టానానికి కూడా తగినంత సమయం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. అప్పటికీ మంత్రి పదవిపై పార్టీ ఎటూ తేల్చకపోతే పార్టీలో ఉంటూ తనకు మంత్రికి అడ్డుపడుతున్న ప్రభుత్వ లేదా పార్టీ పెద్దలపై పోరాటం చేయడమా? లేదా ప్రత్యామ్నాయం చూసుకోవడమా? అన్నది తేల్చుకోవాలనే స్పష్టమైన వ్యూహంతో ఎమ్మెల్యే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని..
తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కరాఖండిగా తేల్చిచెప్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో గత కొన్నాళ్లుగా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధిష్టానంపైనా అలిగి దూరం జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చినా రాజగోపాల్‌రెడ్డి లైట్ తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం ఖర్గే హైదరాబాద్ రాగా మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు ఆయన బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కు వెళ్లి కలిసారు. సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, బాలునాయక్, రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఖర్గేతో సమావేశమై మరోసారి తమ వాదనను వినిపించారు. సామాజికవర్గాల వారీగా తమకు ఉన్న అవకాశాలు, పార్టీలో సీనియార్టీ తదితర అంశాలను ఆయన ముందుంచినట్లు తెలిసింది. అయితే ఖర్గేతో భేటీ సమాచారం ఉన్నా రాజగోపాల్‌రెడ్డికి పట్టించుకోలేదని తెలిసింది.