సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.4వేల చొప్పన పంపిణీ చేశారని స్వయంగా ఓటర్లే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గ్రాఫ్ దాదాపు 10శాతం పడిపోయిందని సొంత సర్వేలో తేలడం, ఇటీవల మిర్యాలగూడలో రేవంత్‌రెడ్డి, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దాని ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని గ్రహించిన అధిష్టానం సోమవారం రాత్రి వరకు అన్ని మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న ప్రతి అభ్యర్థికి రూ.10 లక్షల చొప్పున పంపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు లోకల్‌గా మరో రూ.30 లక్షలు కలిపి మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల ఐదు మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో 56 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ అం టేనే కీచులాటలకు పెట్టిందిపేరు. అలాంటిది సూర్యాపేటలో రెండు వర్గాలు ఒక్కటైనా ఛైర్మన్ కావాలనుకునే వారి మధ్య మాత్రం అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నా యి.
ఇప్పటికే ఒకరిని చైర్మన్‌గా ప్రకటించగా అదే పార్టీలో చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న మరో ఇద్దరు ఎలాగైనా చైర్మన్ అభ్యర్థిని ఓడించాలని సొంత వార్డులో ప్రచారం చేసుకుంటూనే పక్కవార్డులో చైర్మన్ అభ్యర్థికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చారు. చైర్మన్ అభ్యర్థి వార్డులో ఇతర పార్టీకి చెందిన ఒకరితోపాటు ఇండిపెండెంట్‌కు ఓటేయాలని చీరలు, డబ్బులు సరఫరా చేయడంతో పసిగట్టిన చైర్మన్ అభ్యర్థి డబ్బులు పంచుతున్న ఇద్దరు సొంత పార్టీ కార్యకర్తలను స్పెషల్ స్కాడ్‌కు పట్టిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరడం సూర్యాపేటలో చర్చనీయాంశమైంది. మరో పక్క బీఆర్ఎస్ మాత్రం పదేండ్లలో చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా చూపిస్తూ ఇచ్చిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఓటర్లను అభ్యర్థించడంతో ప్రజలు బీఆర్ఎస్ హయాం స్వర్ణయుగాంలా ఉందని, రెండేండ్ల కాంగ్రెస్ పాలన దారుణంగా ఉందంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టేందుకు సిద్ధపడినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతున్నది.