నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి9(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు బహిరంగ ప్రచారం చేసిన అభ్యర్థులు.. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లకు తెరలేపారు. ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రలోభాలతో రంగంలోకి దిగారు. డబ్బు, మద్యం, చీరలు, తదితర బహుమతులతో ఓటర్ల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బుధవారం ఉదయం పోలింగ్ మొదలయ్యే వరకూ వారికీ పాట్లు తప్పవు.
మరోవైపు పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. మంగళవారం డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సాయంత్రానికి సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటారు. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు 17 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచా రం ముగిసింది. వారం రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును ఐదారుసార్లు కలిసి ఓట్లను అభ్యర్థించారు. చివరిరోజు సోమవారం వార్డుల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బలప్రదర్శనలకు దిగారు.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుంది. ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర కీలక నేతలు, ఎన్నికల ఇన్చార్జీలు బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కీలకపాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార సమయంలోనే రూ.లక్షలు ఖర్చు చేయక తప్పలేదు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా స్వయంగా రంగంలోకి దిగి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అధికార బలంతో పాటు బెదిరింపులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులను అడ్డుకుంటూ డబ్బు, ఖరీదైన మద్యం, చీరలు తదితరాలను నమ్ముకున్నారు.
వాటికోసం ఇప్పటికే అభ్యర్థులకు వార్డుల పరిస్థితిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు పార్టీ ఫండ్ పేరుతో అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అవసరాన్ని బట్టి అభ్యర్థులు సైతం మరో రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒక్కో వార్డులో సగటున కాంగ్రెస్ అభ్యర్థులు రూ.50లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ కార్పొరేషన్లో కొన్ని డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ఓటుకు 3వేల నుంచి 5వేలతో పాటు ఖరీదైన మద్యం, చీరలు, ఇతర బహుమతులతో కాంగ్రెస్ అభ్యర్థులు రూ. కోటికి పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల్లో సానుకూలత లభించకపోవడంతో ప్రలోభాలపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిసింది. ఏది ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్లు కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యం, తదితర బహుమతులను స్వీకరించినా ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ము ఖ్యనేతలు సైతం కాంగ్రెస్ నేత లు ఇచ్చే డబ్బులు తీసుకుని, బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లేయాలని పిలుపునిస్తున్నారు. రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అంటూ…రాష్ట్రం బాగుండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.