– కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 21 : అధికార పార్టీ తలొగ్గి కీలుబొమ్మగా వ్యవహరించకుండా జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు చట్టాలను నిబద్దతతో అమలు చేసినట్లయితే దళిత యువకుడు కర్ల రాజేష్ దుర్భరణం పాలయ్యేవాడు కాదన్నారు. పోలీసులు చేసిన దుశ్చర్యకు రాజేష్ కుటుంబం నేడు అనాథగా మిగిలిందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన అభ్యర్థులపై దాడులు జరిగి ఆస్తి నష్టం జరిగినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు నడి వీధుల్లో స్వైర విహారం చేసినప్పటికీ అప్పుడప్పుడు మానవతావాదిగా తమరు స్పందిస్తున్నారేమో గానీ, తమ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అధికార పార్టీ కనుసన్నలలో పోలీస్ స్టేషన్లను వారి కార్యాలయాలుగా మార్చారని విమర్శించారు.
ఈ దుశ్చర్యలను ఖండిస్తూ బాధితుల పక్షాన ఈ నెల 24న చలో కోదాడ కార్యక్రమాన్ని చేపడితే దానిని నిలువరించేందుకు 30 పోలీస్ యాక్ట్ ను అర్ధరాత్రి నుండి అమలు చేస్తామనడం సమంజసం కాదన్నారు. కోదాడలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పలు పత్రికలలో పతాక శీర్షికన కథనాలు వస్తున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం మాత్రం చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపాలని ఆలోచన చేయటం భావ్యం కాదన్నారు. తాము ఈ అంశాలపై చలో కోదాడ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నామో ఆ అంశాలపై సంపూర్ణ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలు సామాన్యులకు చుట్టాలుగా ఉండాలే గానీ కష్టాలు తెచ్చే విధంగా ఉండకూడదని తాము భావిస్తున్నామన్నారు.. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించే బాధ్యుడిగా ప్రతిపక్షాల హక్కులను పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.