చండూరు,జూలై 1 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న ధ్వజమెత్తారు. చండూరులోని వెంకన్నకు చెందిన భవన సముదాయాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీసీ నేతను అయినందున తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కక్ష గట్టి తన భవనాన్ని కూల్చివేయించారన్నారు. తాను లేని సమయంలో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుం డా భవనాన్ని అక్రమంగా కూల్చివేసినట్లు చెప్పారు.
రోడ్డుకు ఒక్కోవైపు 40 ఫీట్లను అధికారులు నిర్ణయించగా తాను 43 ఫీట్ల దూరంలో భవనం నిర్మించానని, అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే అదేశాలతో భవనం కూల్చివేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. చండూరులో నిర్మిస్తున్న రోడ్డు పూర్తిగా మున్సిపల్ చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. బస్టాండ్ వద్ద ఒక విధంగా, ఇక్కడ మరో విధంగా, అంగడిపేట రోడ్డులో ఇంకో విధంగా ఇష్టారీతిన విస్తర ణ పనులు చేపడుతున్నారన్నారు. పట్టణాభివృద్ధికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన పక్కనే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యాపార సముదాయం అక్రమంగా నిర్మిస్తున్నారని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
అధికార పార్టీ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కమీషన్లు ఇస్తూ తక్కువ వెడల్పులో రోడ్డు నిర్మిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తిరిగేవారే కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.