మోత్కూరు, మార్చి 7: పదవుల కోసం పార్టీలు మారిన బ్యాచ్ నీతి ముచ్చట్లు చెబుతుంటే ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొన్నేబోయిన రమేశ్ అన్నారు. శుక్రవారం మోత్కూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
దొంగలకు దొంగబుద్దులు, వసూలు బ్యాచ్లకు వసూళ్ల మీదనే ఆలోచనలు వస్తాయని వారు విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదవులకోసం పార్టీ మారింది ఎవరో.. 25 సంవత్సరాలుగా ఒకే పార్టీలో పనిచేస్తున్నది ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు. తన సొంత గ్రామంలో తమ ఉనికికి భంగం కలుగుతుందని పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసి సొంతపార్టీ ఎంపీటీసీని ఓడగొట్టింది ఎవరో కూడా ప్రజలకే తెలుసని అన్నారు. అంబేడ్కర్ చౌరస్తా అయినా సరే.. మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద అయినా సరే చర్చకు సిద్ధమని తెలిపారు.
మీ సామెల్ గారికి రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్పై అదే సామెల్ విమర్శలు చేస్తే సాహించేది లేదని వారు అన్నారు పది సంవత్సరాలుగా ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు అందకపోతే కిశోరన్న నాయకత్వంలో అభివృద్ధి జరగకపోతే.. మీరు ఏమి ఆశించి బీఆర్ఎస్లోకి వచ్చారని ప్రశ్నించారు. మళ్లీ ఏం ఆశించి కాంగ్రెస్లో చేరారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ పట్ల నాయకుడి పట్ల విశ్వాసంతో నమ్మకంగా పనిచేస్తానని తెలిపారు. మీలాగా అవకాశవాద రాజకీయాలు చేయమని అన్నారు. అలాంటి వారు తమపై విమర్శలు చేస్తే ప్రజలే నవ్వుకుంటున్నారని అన్నారు.