మిర్యాలగూడ, మే 19 : నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో సంచలనం సృష్టించిన రుద్రాక్షి సుమలత (45), ఆమె కుమార్తె లావణ్య(23) హత్య కేసును హాలియా పోలీసులు ఛేదించారు. కేవలం ఐదెకరాల భూమిని దక్కించుకోవాలనే దురాశతోనే తల్లీ కూతుళ్లను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లావణ్య పేరు మీద ఇబ్రహీంపేట పరిధిలో సుమారు 5.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశతో నిందితులు కొంతకాలంగా తగాదాలు సృష్టిస్తున్నారు. చివరకు తల్లీకూతుళ్లను హతమార్చి ఆస్తి దక్కించుకోవాలని పథకం పన్నారు. ఈనెల 17న తల్లీకూతుళ్లు ఇబ్రహీంపేట శివారులోని పామాయిల్ తోటకు వెళ్లారు. సమయం కోసం వేచి చూస్తున్న నిందితులు వారిని వెంబడించి, తోటలోకి వెళ్లగానే ఒక్కసారిగా దాడి చేశారు.
ప్రతిఘటించకుండా ఉండేందుకు కళ్లలో కారంపొడి చల్లి, వారి చున్నీలతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో త్రిపురారం మండలం నీలాయిగూడానికి చెందిన గుర్రం రమేశ్, గుర్రం నవనీత, చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన అంగడి రేణుక, చౌటుప్పల్ మండలం రెడ్డిబాయిగూడానికి చెందిన గుండ్లపల్లి స్వామి, ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి మహేశ్‌ను పోలీసులు సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఓ బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా పరారీలో ఉన్న నిమ్మల శశికళ, నిమ్మల వెంకన్న, రుద్రాక్షి నరసింహ కోసం గాలిస్తున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సాగర్ సీఐ శ్రీను నాయక్ నేతృత్వంలో త్రిపురారం, హాలియా ఎస్ఐలు నరేశ్, సాయి ప్రశాంత్, పోలీస్ సిబ్బంది కృష్ణ, కోటి, శివ, ముని, వెంకటేశ్వర్లు, రమేశ్ నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులను రిమాండు కోసం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.