యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు 8,400 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని తాసీల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 34,750 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను విచారించేందుకు వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ వరకు విచారణ పూర్తి చేసి.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
దివ్యాంగులకు ఇప్పటికే అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పింఛన్‌ను మరింత పెంచింది. ఇటీవల వారికి రూ. వెయ్యి అదనంగా పెంచింది. ఒకటి నుంచి దివ్యాంగులకు రూ. 4,016 పింఛన్ అందనుంది. దీంతో జిల్లాలో 13,480మందికి లబ్ధి చేకూరనుంది. ఇక నుంచి రాష్ట్ర సర్కారు జిల్లాలో ప్రతి నెలా అదనంగా రూ. 1.34కోట్లను భరించనుంది. మొత్తంగా నెలకు రూ. 5.41కోట్లను దివ్యాంగ పింఛన్లకు ఖర్చు చేయనుంది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా రూ. 200 పింఛన్ మాత్రమే ఇచ్చాయి. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయి.
దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి రాష్ట్ర శ్రీకారం చుట్టింది. ఈ పథకం కిందం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే తొలి విడత సమర్థంగా అమలు చేసింది. ప్రస్తుతం రెండో విడత కోసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో విడుతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 1,100 మందికి దళిత బంధు సాయం అందించనున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గంతోపాటు మునుగోడు, తుంగుతుర్తి నియోజకవర్గాల్లో రెండు మండలాల చొప్పున, నకిరేకల్‌లోని రామన్నపేట మండలాల ఎస్సీలకు కూడా పథకం వర్తించనుంది. కాగా మొదటి విడుతలో జిల్లాలో 413 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 41 .30 కోట్లను లబ్ధిదారులకు అందించిన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. రూ.లక్షలోపు రుణాలను సర్కారు మాఫీ చేస్తున్నది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో జిల్లాలో వేల మందికి రైతులకు మేలు జరుగుతున్నది. లక్ష అప్పు మాఫీ కూడా త్వరలోనే చేయనున్నారు. ఈ మేరకు కసరత్తు కొనసాగుతున్నది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమలు చేయనుంది. కొత్తగా తెలంగాణ చేనేత పథకాన్ని తెచ్చింది. దీని కింద నేత కార్మికులకు ఫ్రేమ్ మగ్గాలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే అమల్లో ఉన్న రసాయనాలు, నూలు సబ్సిడీ స్థానంలో ప్రతి నెలా నేత కార్మికుడికి రూ. 3వేలు ఇవ్వనుంది. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు ఔట్పేషంన్ వైద్య సేవలకు శ్రీకారం చుట్టనుంది. నేత కార్మికులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. దీంతో జిల్లాలో సుమారు 11వేల మందికి లబ్ధి చేకూరనుంది. మరోవైపు రుణమాఫీ తరహాలో చేనేత మాఫీ కూడా చేసేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్మికులకు బీమా సదుపాయం కల్పించింది. కార్మికులు మరణిస్తే బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనుంది. దాంతో జిల్లాలోని వేల మంది కార్మికులకు లబ్ధి చేకూనుంది. అదేవిధంగా పంచాయతీ కార్మికులు చనిపోత అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా రూ. 5 నుంచి 10 పెంచాలని నిర్ణయించింది.
బీసీ, మైనార్టీ కోసం ప్రత్యేకంగా బీసీ, మైనార్టీల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హులకు రూ. లక్ష సాయం అందించనుంది. బీసీకు ప్రతి నియోజకవర్గంలో మొదటి విడుత 300 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనుంది. ఈ పథకం కింద జిల్లాకు ఇప్పటివరకు రూ. 6 కోట్ల మంజూరయ్యాయి. అలాగే మైనార్టీకు సైతం 100 శాతం సబ్సిడీతో మైనార్టీలకు రూ. లక్ష అందనున్నది. ఈ పథకం కింద ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 120 యూనిట్లు, భువనగిరి నియోజకవర్గానికి 120 యునిట్లు మొత్తం 240 యునిట్లు మంజూరయ్యాయి. ఈ పథకానికి ముందుకు స్వయం ఉపాధి కింద 60మంది మైనార్టీలకు ఆర్థిక సాయం మంజూరైంది.