వలిగొండ, ఏప్రిల్ 5 : రైతుల బాగు కోసం గూడూరు మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామం లో శనివారం జరిగిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ మోహన్‌రెడ్డి సంతాప సభలో ఆమె పాల్గొన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 2006-07 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా 600 ఎకరాలకు సాగు నీరందించే బృహత్తర కార్యక్రమానికి మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
రైతుల కోసం సొంత నిధులతోపాటు భూమిని కూడా దానం ఇచ్చి ఎత్తిపోతలను పూర్తి చేశారన్నారు. ఆయన కృషితో ఎదుళ్లగూడెం గ్రామ రైతులకు నిరంతరాయంగా సాగు నీరందుతున్నదని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్తూ తిరుగు ప్రయాణంలో మండలంలోని టేకులసోమారం గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులతో రైతు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని తెలిపారు. పంటలు ఎండిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మ వెంకట్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, పనుమటి మమత నరేందర్‌రెడ్డి, డేగల పాండరి పాల్గొన్నారు.