కోదాడ, జనవరి 06 : కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లోక్ సభ సమావేశాల్లో దేశంలోని సమస్యలపై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల విమర్శలతో చర్చ వాడి వేడిగా జరిగింది. ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ సలీం షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సమకాలీన సమస్యలపై విద్యార్థులకు అవగతం కలుగుతుందని, విమర్శలు, ప్రతి విమర్శలతో మేధాశక్తి పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు లింగయ్య, ఉపాధ్యాయులు కరుణ, రవి, బడుగుల సైదులు పాల్గొన్నారు.