యాదాద్రి భువనగిరి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తేలేదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. 60లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని, అందరూ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని మండిపడ్డారు. భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమది రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయంపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదన్నారు. తమది మాటలు, విజ్ఞత, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసిన సంస్కృతి అని చెప్పారు.
60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది?
మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని కవిత సూచించారు. పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తుంటే 60 ఏండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. అందులో భాగంగానే 36 ఎస్టీపీలను ఏర్పాటు చేయడంతోపాటు గోదావరి నదితో మూసీని అనుసంధానించాలని భావించారని గుర్తు చేశారు. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో ప్రజా ధనం లూటీ చేయాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండలో కేసీఆర్ మొదలుపెట్టిన నీటిపారుదల శాఖ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలని చూస్తున్నారని, అది ఎవరి తరం కాదని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ. 78 వేల కోట్ల పనులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారుల ఖిలా అని కవిత అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, ఉమ్మడి జిల్లాలో మూడు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మెడికల్ కళాశాల అయినా తీసుకొచ్చిందా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం రూ. 36 వేల కోట్ల ఖర్చు చేశామని, రూ. 42వేల కోట్లతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట సాగైందని, ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో 10శాతం కూడా దాటలేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ చేశారని ఆరోపించారు. యాసంగిలో ఎస్సారెస్పీకి నీళ్లివ్వకుండా పంటలను ఎడబెట్టారని మండిపడ్డారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని, సం క్రాంతి కూడా పోయిందని కవిత దుయ్యబట్టారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
మహిళలకు ఇచ్చిన ఏ హామీలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని, ఆడబిడ్డలు ఉద్యమం చేయాలని కోరారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గ్రామ సభల తర్వాత అర్హులకు నాలుగు పథకాలు అందకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బొల్ల శివశంకర్, కొలుపుల అమరేందర్, జనగాం పాండు, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.