నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 20 : దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో రెండో విడుత దళిత బంధు అందని బాధితులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. నల్లగొండ మాజీ కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు తీవ్ర ద్రోహం చేస్తున్నదన్నారు. ఎన్నికల ముందు కోడ్‌తో ఆగిపోయిన దళిత బంధు లబ్ధిదారులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొసీడింగ్‌లు ఇచ్చిందని, లబ్ధిదారులందరూ బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేశారని, ఇందుకు సంబంధించి నిధులు కూడా కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులపై కక్ష కట్టి నిధుల విడుదలకు ఆటంకం కల్పించడం అన్యామన్నారు.
ఆ రోజు గ్రౌండింగ్ పూర్తయిన వారందరికీ ఇప్పటికైనా నిధులు విడుదల చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వానికి దళితులు తగిన రీతితో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గం నుంచి దళిత బంధు సాధన సమితి కమిటీ కన్వీనర్ లక్ష్మయ్య, కో కన్వీనర్ బడుపుల శంకర్, లింగయ్య, మర్రి రేణుక, రూపని రవి, రాంబాబు, యాదయ్య, నాగయ్య, ఏడుకొండలు, కృష్ణయ్య, నాగర్జున, వెంకన్న, జానీ, పిచ్చయ్య పాల్గొన్నారు.