మునుగోడు, మే 02 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ స్థలంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి లభ్యతపై ఆరా తీశారు. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు ఎన్ని కబ్జాకు గురయ్యాయి, ఇంకా ఎంత మిగిలి ఉంది అని సర్వే చేసి తేల్చాలని అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో పాటు భవిష్యత్లో ప్రజావసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడానికి భూమి అవసరం ఉందని, కావునా ప్రభుత్వ భూమిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మునుగోడు తాసీల్దార్ నరేందర్, డిప్యూటీ తాసీల్దార్ నరేశ్, సర్వేయర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.