చౌటుప్పల్‌రూరల్, నవంబర్11 : ఉప ఎన్నిక తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం.. 10 నెలల్లోనే నియోజక వర్గంలో 570 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినం..మరి కొన్ని పనులు కొనసాగుతున్నాయి.. ప్రజలు మరో వారు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జైకేసారం, కుంట్లగూడెం, నేలపట్ల, మందళ్లగూడెం, ఎస్ లింగోటం, ఆరెగూడెం, పంతంగి, కాట్రేవు, ధర్మోజిగూడెం గ్రామాలలో కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు కూసుకుంట్లను ఘనంగా స్వాగతించారు.
డప్పుచప్పుళ్లు, కోలాటాలతో స్వాగతం పలకడంతో పాటు మహిళలు బొట్టుపెట్టి, హారతిచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల కూడలిలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఊసరవెల్లిలా రోజుకో పార్టీ, పూటకో మాట మార్చే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలు నమ్మితే గతంలోలాగ మళ్లీ గోసపడతామని చెప్పారు. గతంలో రాజగోపాల్‌రెడ్డిని నమ్మి ఓటువేసి గెలిపిస్తే బీజేపీకి అమ్ముడుపోయి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాంట్రాక్టుల కోసం పాకులాడాడన్నారు. తన స్వార్థం కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడన్నారు. గతంలో నమ్మి గెలిపిస్తే నాలుగేండ్లు కనిపించకుండా పోయిన వ్యక్తి మళ్లి మన గ్రామాలకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా కేవలం 10 నెలల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించినట్లు చెప్పారు.
తన బలం, బలగం అంతా మునుగోడు ప్రజలేనని, వారి అండదండలతోనే తిరిగి మునుగోడు సేవకుడిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజలకోసం, వారి సమస్యల పరిస్కారం కోసం మీలో ఓ ఇంటివాడిగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసి మ్యానిఫెస్టోలో ప్రకటించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని.. కేవలం ఎన్నికల సందర్భంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే వారిని నమ్మరని పేర్కొన్నారు.
కాంట్రాక్టుల కోసం పోటీ చేసేవారా.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వారు కావాలా అనేది ప్రజలే నిర్ణయించాలని సూచించారు. ప్రజలు అమాయకులని, తాను ఎటు పోతే అటే వస్తారని భావిస్తున్న రాజగోపాల్‌రెడ్డికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఏగ్రామంలో చూసినా ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది పనులు కనిపిస్తున్నాయని.. మరి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలిచి రాజగోపాల్‌రెడ్డి మునుగోడుకు ఏం చేశాడో చెప్పాలంటూ ప్రజలు నిలదీయాలని కోరారు. ఏనాడూ తట్టెడు మట్టి పోయని వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ఓటు వేసేముందు ప్రజలు ఈ విషయాలన్నీ ఆలోచించాలని, ఎమ్మెల్యేగా తనకు మరొక అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిరికాటి నిరంజన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు సైదులు, చౌట వేణుగోపాల్, రిక్కల సత్తిరెడ్డి, కొలను శ్రీనివాస్‌రెడ్డి, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు సంజీవరెడ్డి, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.