మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్, జూలై 18 : తెలంగాణలో రైతుల కరెంట్ కష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తుంగపహాడ్ గ్రామ రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించిన రైతుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, కరెంట్ కష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. చంద్రబాబు పాలనలో 6గంటల కరెంట్ ఇవ్వగా.. కాంగ్రెస్ హయాంలో 8గంటల కరెంట్ ఇచ్చారని తెలిపారు. అది కూడా రాత్రి సమయంలో ఇవ్వడంతో రైతులు మోటర్లు పెట్టడానికి వెళ్లి ఎంతో మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన రైతు కుటుంబాలను ఆనాడు చంద్రబాబు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ కష్టాలు తప్పవని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారన్నారు. చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లులు తగ్గించాలని రైతులు ధర్నా చేస్తే గుర్రాలతో తొక్కించి కాల్పులు జరుపడంతో రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
చంద్రబాబు శిష్యుడు అయిన రేవంత్‌రెడ్డి రైతులకు 3గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవసాయం గురించి తెలియని మూర్ఖుడని, అందుకే ఆయన మనసులోని మాటను అమెరికాలో బయటపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల కరెంట్ ఇచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని, మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల రైతు బీమా అందించి భరోసా కల్పిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కరెంట్ కష్టాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్న రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం నీటిని పాలేరు చెరువుకు, ఆ చెరువు నుంచి పెద్దదేవులపల్లి చెరువుకు మళ్లించి కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.2వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ 67 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎలా పాలించాయో, వారి పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో? అందరికీ తెలుసన్నారు. 9ఏండ్లలోనే తెలంగాణను పంటల సీమగా మార్చిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడని పేర్కొన్నారు. సమావేశాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రామకృష్ణ, ఆదిరెడ్డి, సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.