మిర్యాలగూడ, నవంబర్ 8: స్వరాష్ట్రంలో పదేండ్లుగా మిర్యాలగూడ పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని 42, 44, 48 వార్డుల పరిధిలోగల సీతారాంపురం కాలనీలో ప్రగతియాత్ర నిర్వహించారు. ముందుగా గణేశ్ మార్కెట్లో వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం నిర్వహించిన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులతో, బొట్టు పెట్టి స్వాగతించారు.
పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి గులాబీ జెండాలతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ పట్టణంలోన్ని అన్ని వార్డులో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధ్దిదారులకు అందించినట్లు చెప్పారు. పట్టణంలోని 42వ వార్డులో రూ.58.77లక్షలతో అభివృద్ధి పనులు చేశామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.3.81 కోట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. 44వ వార్డు పరిధిలో రూ.76.97లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని, సంక్షేమ పథకాల ద్వారా రూ.4.12 కోట్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు.
48వ వార్డులో రూ.40లక్షలతో అభివృద్ధి పనులు, రూ.3.97కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారని, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ చైర్మన్ మెరుగు రోశయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, రాష్ట్ర నాయకుడు అన్నభీమోజు నాగార్జునాచారి, కౌన్సిలర్లు చీదెళ్ల సత్యవేణీశ్రీనివాస్, మల్గం రమేశ్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఖాదర్, తిరుమలగిరి వజ్రం, దైద సోముసుందర్, పునాటి లక్ష్మీనారాయణ, మెరుగు సంజయ్, ఆయిల్ శ్రీను, కందగట్ల అశోక్, పిన్నబోయిన శ్రీనివాస్, ఎర్రమళ్ల దినేశ్, షోయబ్, కుప్పాల సుబ్బారావు, కోల రామస్వామి పాల్గొన్నారు.
పట్టణంలోని 42వ వార్డు సీతారాంపురం కౌన్సిలర్ చీదెళ్ల సత్యవేణీశ్రీనివాస్ తమ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపించారు. ప్రత్యేకంగా తయారు చేసిన బంతిపూల గజమాలను క్రేన్ సాయంతో ఎమ్మెల్యేకు వేసి తమ ఆత్మీయతను చాటి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ 44వ వార్డు అధ్యక్షుడు జంజరాల నాగరాజు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.