మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్, జూలై 20 : కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని, రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఆలగడప, కొత్తగూడెం రైతు వేదికల్లో గురువారం నిర్వహించిన రైతుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అర్ధరాత్రి కరెంట్‌తో రైతులు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందడం వంటివి జరిగేవన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మితేనే రాష్ట్రంలో నిరంతర వెలుగులు కొనసాగుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చేది మూడు గంటల కరెంటేనని రేవంత్‌రెడ్డి చెప్పారని, దీనిపై రైతులు గ్రామాల్లో చర్చ చేయాలని చెప్పారు. 24గంటల ఉచిత విద్యుత్ కావాలో.. 3గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇవ్వడం వల్ల నేడు 2.30కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు.
ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలా తోక లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని పిట్టల దొరలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం జలాలను పాలేరు నుంచి ఎడమ కాల్వకు రివర్సబుల్ పద్ధతిలో అందించేందుకు రూ.2వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలువాలని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, నాయకులు గడగోజు ఏడుకొండలు, ధనావత్ చిట్టిబాబూనాయక్, పూసపాటి రాజయ్య, లింగయ్య, విద్యాసాగర్, పద్మయ్య, శ్రీనివాస్, శ్రీలత, లలిత పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలో తిప్పలు పడ్డాం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 గంటల కరెంటు ఇస్తే ఎన్నో తిప్పలు పడ్డాం. రాత్రివేళ పొలాలకు నీళ్లు పెట్టడానికి భయపడుకుంటూ వెళ్లేవాళ్లం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మాకు మంచి రోజులు వచ్చాయి. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు సరిపోతదంటున్నారు. 3 గంటల కరెంటు ఇచ్చేటోళ్లకు ఊళ్లో ఏ ఒక్కరం ఓటు వేయం. వాళ్లకు ఓటు వేస్తే కరెంటు మళ్లీ 3గంటలే వస్తది. అట్లయితే మా పంటలు ఎట్ల పండుతాయి. రైతులమంతా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ సారుకు ఓటు వేద్దాం.
– మైనంపాటి గోవర్ధన్‌రెడ్డి, రైతు, కొత్తగూడెం (మిర్యాలగూడ రూరల్)