మోత్కూరు, మార్చి 9 : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామెల్ జోకర్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో మందుల సామెల్ పని చేతకాక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నట్లు ఎద్దేవ చేశారు.
బీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్‌రావు లేకుంటే ఆయనకు రాజకీయ జీవితం ఎక్కడిదని ప్రశ్నించారు. నాడు గిడ్డంగుల చైర్మన్ ఇవ్వడం వల్లే ఈ రోజు ఎమ్మెల్యే అయినట్లు తెలిపారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్ధినట్టుగా ఆయన తీరు ఉన్నట్లు విమర్శించారు. ఎమ్మెల్యే ఆయన కొడుకులు కమీషన్లకు ఎగబడి నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపడేసినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ తెచ్చిన నిధులతోనే ఇప్పటికీ అభివృద్ధి పనులు జరిగాయని, ఎమ్మెల్యే సామెల్ గెలిచిన తర్వాత తెచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి ఎంటో చూపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిల్లులు పాస్ చేయడానికి 20 శాతం కమీషన్లు తీసుకుంటుంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యే కమీషన్లకు తట్టుకోలేక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని, అందుకు నియోజకవర్గంలో ఆగిపోన పనులే నిదర్శనం అన్నారు. కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు బిక్కేర్ లో పారుతున్న కాళేశ్వరం జలాలకు పూజలు చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏడాది కాలంలోనే ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశాడని, ఇప్పుడు పారుతున్న నీళ్లన్నీ కేసీఆర్, బీఆర్ఎస్ పుణ్యమే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకుబ్ రెడ్డి, మహేందర్నాథ్, నాయకులు జంగ శ్రీను పద్మారెడ్డి. దొండ నరసయ్య పాల్గొన్నారు.