శాలిగౌరారం, జూన్ 9 : తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని బైరవునిబండ, తక్కెళ్లపహాడ్, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాలకు సాగు నీరందించేందుకు అక్కెనపెల్లి నుంచి అసిఫ్ నెహర్ కాల్వ నిర్మాణానికి ఇప్పటికే అవసరమైన నిధులతో పాటు భూ నిర్వాసితులకు అందించేందుకు రూ.1.32 కోట్లు కూడా మంజూరు చేయించినట్లు చెప్పారు.
ఈ కాల్వ నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల్లోని 28 వేల ఎకరాలు సశ్యశ్యామలం అవుతాయన్నారు. మండలంలోని వంగమర్తి వద్ద మూసీ నది నుంచి ప్రభుత్వ అనుమతితోనే ఇసుక తరలిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. తాను రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తినని, వారికి నష్టం కలిగేలా ఇసుకను తరలిస్తే మాత్రం వెంటనే ఆపి వేయిస్తానన్నారు. ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ అవసరాలకు తరలిస్తే మాత్రం అడ్డుకోనన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ఇసుక రవాణాపై క్లారిటీ తీసుకొని ప్రభుత్వం అనుమతిస్తూ జారీ చేసిన జీఓ కాపీని చూపించారు. తాను రైతు సంక్షేమం కోసం ఎప్పటికీ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, అన్నెబోయిన సుధాకర్, చాడ సురేశ్‌రెడ్డి, పాదూరి శంకర్‌రెడ్డి, బండపెల్లి కొమరయ్యగౌడ్, నోముల జనార్దన్, బెల్లి వీరభద్రం, ఎర్ర చైతన్య, కట్టంగూరి సురేందర్‌రెడ్డి, చింత ధనుంజయ్య, భూపతి అంజయ్యగౌడ్, పెరుమాండ్ల నరేశ్,
పాకాల సతీశ్, పడాల రమేశ్, నిమ్మల మధుగౌడ్, గణేశ్ పాల్గొన్నారు.