నాంపల్లి, నవంబర్ 23 : బీఆర్ఎస్ పాలనలోనే పల్లెలన్నీ సస్యశ్యామలంగా మారాయని బీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతితో కలిసి మండలంలోని నర్సింహులగూడెం, జాన్‌తండా, రామదాసుతండా, పెద్దాపురం, తిరుమలగిరి, మల్లపురాజు పల్లి, తుంగపాడు, గౌరారం ,స్వాములవారి లింగోటం, వడ్డేపల్లి, చిట్టెంపహాడ్, నెవిళ్లగూడెం, దామెర, నేరెళ్లపల్ల్లి గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామస్తులు స్వచ్ఛందంగా హారతులు, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలిచిన ఏడాది కాలంలోని రూ.570 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రతి గ్రామంలో రూ. 40 నుంచి 50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో నిర్మిస్తున్న లక్ష్మణాపురం, చర్లగూడెం ప్రాజెక్టులు పూర్తి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెసోళ్లు బూటకపు హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాల్నో 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్నో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టుల పైన ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై ఉండదన్నారు. 12 ఏండ్లుగా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఏ చిన్న అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదని అన్నారు.
బంగారుగడ్డ నుంచి కొండమల్లేపల్లి వరకు రూ.56 కోట్ల తో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు శంకుస్థాపన చేస్తున్నట్లు ఎన్నికలు పూర్తికాగానే పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో రాగానే మ్యానిఫెస్టో ప్రకారం ప్రజలకు రేషన్‌కార్డు పై సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉండి గుంట భూమి లేని ప్రతి ఒకరికీ సీఎం కేసీఆర్ బీమాతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రూ.5 లక్షలు ,రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ .3 వేల భృతి తదితర పథకాలు అమలు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడ నర్సింహారావు ఏడు దొడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు సఫావత్ సర్దార్ నాయక్ మాల్ మారెట్ డైరెక్టర్లు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాద య్య, బల్గూరి విష్ణువర్ధన్, ఎండీ సలీం గజ్జెల యాదగిరిరెడ్డి, బత్తుల విజయ్, మేకల దేవేందర్, బెకం రమేశ్ పాల్గొన్నారు.