మర్రిగూడ, జనవరి 13 : మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులతో నిర్వహించిన సమీక్ష పమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కమిట్మెంట్తో పని చేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది నియామకం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బయటి నుంచి వచ్చే వారిలో కొందరు మహిళా సిబ్బంది విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రంగారెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ మాత్రునాయక్, వైద్యాధికారులు శంకర్, దీపక్, అరుణతారా, తరుణ్, రుబీనా, షాలినీ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముద్దం నర్సింహగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు : నియోజకవర్గం నుంచి జాతీయ రహదారి వరకు ఉన్న కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు అభివృద్ధిపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ పరిధిలోని కచలాపురం నుంచి వెల్మినేడు, తాస్కానిగూడెం నుంచి చండూరు, అంతంపేట నుంచి శివన్నగూడెంవరకు రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. బంగారగడ్డనుంచి నాంపల్లి వరకు, ముష్టిపల్లి నుంచి మల్లేపల్లి వరకు రోడ్డు వెడల్పునకు ప్రపోజల్స్ అందించాలన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధి, నల్లగొండ-చండూరు రోడ్లో డివైడర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. సంబంధింత శాఖ అధికారులు పాల్గొన్నారు.