చౌటుప్పల్, జూన్ 14 : పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం చౌటుప్పల్ పట్టణానికి వచ్చారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించి డ్రైనేజీ, సీసీరోడ్డు పనులు, బిల్లుల రికార్డుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ఇప్పటి వరకు రూ.12 కోట్ల అగ్రిమెం ట్ వ్యాల్యూలో గ్రాస్ ఎంత బుక్ అయ్యింది, దానిపై క్లారీటీ ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఇంజినీరింగ్ అధికారులపై ఫైర్ అయ్యారు.
ఆయన మాట్లాడుతుండగా ఓ మహిళా ఉద్యోగి పేపర్‌పై ఏదో రాస్తుండటంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆమెపై పేపర్లు విసిరారు. ‘నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేం.. నాలెడ్జ్ ఉందా? ఉంటే పని చేయండి.. లేకపోతే లీవ్ పెట్టి వెళ్లిపోండి’ అని మండిపడ్డారు. ‘మీరు చెప్పింది వినటానికి నేను రాలేదు.. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా అధికారిని అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం సమజసం కాదని ఎమ్మెల్యే తీరును పలువురు ఖండించారు.