దామరచర్ల, సెప్టెంబర్ 24:రాష్ట్రంలో ఆటవిక పాలన, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కొత్తపేట తండాలో పోలీసుల చిత్రహింసలకు గురైన ధనావత్ సాయి సిద్ధూను బుధవారం ఆయన పరామర్శించారు. అ నంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ ని నెరవేర్చలేక ముఖ్యమంత్రి పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇం డ్లు కూలగొట్టడం, కేసులు పెట్టి జైళ్లకు పంపడం నిత్యకృత్యంగా మారిందని, ఎమ్మెల్యేలు, మంత్రులూ కమీషన్లు దండుకోవడంలోనూ, ముఖ్యమంత్రి మూటలు మోసుకుంటూ ఢిల్లీ పెద్దలకు సమర్పించే పనిలోనూ ఉన్నారన్నారు. ము ఖ్యమంత్రి పదవి నిలబెట్టుకునేందుకు రేవంత్ తన సంపాదనలో 20 శాతం ఢిల్లీలోని రాహూల్‌గాంధీ, మోదీకి సమర్పించుకునే పనిలో ఉన్నాడన్నారు.
రాష్ట్రంలోని రైతులకు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కోసం బారులు తీరారని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఓ పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా కొంతమంది పోలీసు అధికారులు సోయిలేకుండా ప్రవర్తిస్తున్నారని, వారు కాం గ్రెస్ నాయకులకంటే అధ్వానంగా ఉన్నారన్నారు. ప్రత్యేకించి నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు తాము ఐపీఎస్ అధికారులమని గుర్తెరిగి ప్రవర్తించాలని, కిం దిస్థాయి అధికారులను నియంత్రించాలని పలుమార్లు చెప్పినా వారి వైఖరి మారడం లేదన్నారు.
గ్రామస్థాయి, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు హుకుం జారీచేస్తేనే కేసులు పెడుతున్నారని, వారు చెబితేనే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ జీతం ఇవ్వడం లేదని, జనం పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నా ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి హుకుంలు జారీ చేయలేదన్నారు.
కొత్తపేట తండాకు చెందిన సాయిసిద్ధూ అనే గిరిజన యువకుడు యూరియా కోసం ఆటోలో వెళ్లి అక్కడ ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచినందుకే వీడియో చూపిస్తూ పోలీసులు చిత్రహింసలు పెట్టారని, నీకు గుంట భూమి కూడా లేదు.. నీకు యూరి యా ఏం అవసరమంటూ కొట్టడం దారుణమన్నారు. ఈ సంఘటన నుంచి తప్పించుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారని, యూరియా కేసు కాదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.
కేసు ఏదైనా కావొచ్చు చట్టం ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు అమాయకుడిని స్టేషన్లో పెట్టి గంటలపాటు లాఠీలతో కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీన్ని ఎస్పీ ఎలా సమర్ధించుకుంటున్నా రో చెప్పాలన్నారు. నిజమైన దోషులను పట్టుకునే సత్తా వారికి లేదన్నారు. కాం గ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులే అసలైన నేరస్తులని, ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండా జనాన్ని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీవారిపై కేసులు పెట్టాలని, పోలీసులు అనవసరంగా మచ్చ తెచ్చుకోవద్దని, ఇంతగా సాగిలపడి ఉద్యోగాలు చేస్తూ, ఆత్మాభిమానం చంపుకొని పనిచేయవద్దన్నారు.
ఉద్యోగానికి, ప్రజలకు న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలన్నారు. సాయిసిద్ధూ బీఆర్ఎస్ కార్యకర్త కాదని, ఇలాంటి వాటిని ఎస్పీ స్వయంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, సిద్ధూపై జరిగిన దాష్టీకాన్ని బీఆర్ఎస్ ఖండిస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో అరాచకం పెరిగిందని, ప్రజల ఓపిక నశిస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేరస్తును ప్రో త్సహిస్తూ అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.
యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం..
రైతులకు యూరియా అందించలేని చేతగాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అడవిదేవులపల్లిలోని గోన్యా తండాలో గిరిజన మహిళ చనిపోయిందని, యూరియాపై నిలదీస్తే కేసులు పెట్టడం జిల్లాలో అనేక చోట్ల జరుగుతోందని, సోషల్ మీడియాలో యూరి యా వార్తలు పెడితే స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని, యూరియాను బ్లాక్ చేసి ఇష్టమైన వారికి పంచుకుంటూ లారీ లు దారిమళ్లించి దందాలు చేస్తున్నారని విమర్శించారు. నష్టపోయిన సాయి సిద్ధూను కలెక్టర్, ఎస్పీలు ఆదుకోవాలన్నారు.
పోలీసుల తీరు అమానుషం!
దామరచర్ల, సెప్టెంబర్ 24: గిరిజన యువకుడిపై వాడపల్లి పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన దామరచర్ల మండలంలోని కొత్తపేట తండాకు చెందిన ధనావత్ సాయిసిద్ధూను జగదీశ్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. సాయి సిద్ధూ ఇంటికి జగదీశ్‌రెడ్డి చేరుకోగానే సాయిసిద్ధూ, ఆయన భార్య భూమిక కన్నీటి పర్యంతమయ్యారు. జగదీశ్‌రెడ్డి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
ధర్నాలో పాల్గొన్న క్లిప్పింగ్‌ను ఫోనులో చూపిస్తూ కాళ్లపై తీవ్రంగా కొట్టారని, కేసు గురించి కొట్టలేదని, యూరియా కోసమే 20 నిమిషాలపాటు కొట్టారని తాను, తన భార్య ఎంత బతిమిలాడినా వినలేదని, కులం పేరుతో తిట్టారని, లంబాడా కులంలో పుట్టడం తన తప్పా అంటూ రోదించాడు. తాను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, పోలీసుల కొట్టిన దెబ్బలకు పదిహేను రోజులుగా నడవలేని స్థితిలో ఉన్నానన్నారు.
14 రోజులు జైలులో ఉన్నానని, తన భార్య గర్భవతి అని, పిల్లలు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇది విన్న జగదీశ్‌రెడ్డి చలించిపోయారు. ఇంత కఠినంగా వ్యవహరించడం పోలీసులు చేసిన తప్పిదమని, కేసులుంటే కోర్టుకు పంపాలని ఇలా చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సాయిసిద్ధూకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, రాకేశ్‌రెడ్డి, నలమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, ప్రకాశ్‌నాయక్, వీరూ నాయక్, రవీందర్ నాయక్, సచిన్, అమృనాయక్ ఉన్నారు.