నీలగిరి, ఏప్రిల్ 13 : ఈ నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో రజతోత్సవ సభ విజయవంతం కోసం అదివారం నల్లగొండ నియోజకవర్గ సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజలు ఊర్లకు ఊర్లు కదిలి వచ్చి పండుగలా జరిపేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలతోపాటు ఎడ్లబండ్లతో వచ్చేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి అత్యంత తక్కువ కాలంలో ఎక్కువ సభలు పెట్టి విజయవంతం చేయడంలో బీఆర్ఎస్ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుందన్నారు. పార్టీ అవిర్భావం సమయంలో అప్పటి టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు చంద్రబాబుతోపాటు సీమాంధ్ర నేతలు ఎన్నో కుట్రలు చేశారని, వాటిన్నింటిని తట్టుకుని నిలబడి ముందుకు సాగిందని చెప్పారు. టీఆర్ఎస్ను దెబ్బ తీసేందుకు ముందుగా హైదరాబాద్‌లో ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తెలంగాణ ప్రభావం లేదని చెప్పే కుట్రలు చేశారని గుర్తుం చేశారు. కానీ వాటి తర్వాత నల్లగొండ జిల్లా చరిత్రలో ఏ పార్టీ ఏనాడూ పెట్టని విధంగా మొదటి వారికోత్సవ సభను కలెక్టరేట్ ఎదుట పెట్టి విజయవంతం చేశామని చెప్పారు.
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మోసం చేస్తే సుమారు 1200 మంది పిల్లలు అత్మబలిదానాలు చేసుకున్నారని అవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తెలంగాణ వాదం ఉందని చెప్పడం కోసం సూర్యాపేటలో సభలు పెట్టి విజయవంతం చేయడంతోపాటు ఎన్నో ప్రాంతాల్లో సభలు పెట్టి ఉద్యమంలో నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని నిరుపించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం నుంచి పార్టీకి అవసరమైనప్పుడల్లా ఊపిరినందించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నమోరామచంద్ర అన్న నల్లగొండ జిల్లాను అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారని చెప్పారు.
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మలా మారిందని జగదీశ్‌రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చేతకాని తనం, కమీషన్ల కక్కుర్తి వల్లే రైతులపై మిల్లర్లు, దళారులు రైతులపై దాడులకు దిగుతున్నారని అన్నారు. మిర్యాలగూడలో మద్దతు ధర అడిగితే మిల్లర్లు, దళారులు కలిసి దాడి చేశారని, దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో మద్దతు ధర రాక ఓ రైతు ధాన్యపు రాశికి నిప్పు పెట్టాడని, 16నెలల కాలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.
ఇద్దరు మంత్రుల కారణంగా ఎస్ఎల్బీసీ శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసే దమ్ము ప్రభుత్వానికి లేదని, అందులో ప్రమాదం జరిగితే ఇంతవరకు శవాలను బయటకు తీయలేదని విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు ధైర్యం చెప్పే సోయి మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కారును ఇంకా ఎన్ని రోజులు భరించాలని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులు ధైర్యంగా ఉన్నారని, రైతు బంధుతో పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు.
అరు గ్యారెంటీలు, మార్పు అంటే ప్రజలు మోసపోయాయి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చేరే తప్ప వేరేది కాదని అన్నారు. ప్రజలను చైతన్యం చేసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, కటికం సత్తయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కరీంపాష ప్రసంగించారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, వంగాల సహదేవ్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, కొండూరు సత్యనారాయణ, నారబోయిన భిక్షం, తండు సైదులుగౌడ్, నిరంజన్ వలీ, అభిమన్యుశ్రీనివాస్, జమాల్ ఖాద్రి, దేప వెంకట్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, కొప్పోలు విమలమ్మ, కొండ్రు స్వరూపా, జయప్రద, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాలు అస్తవ్యస్థంగా మారాయి. కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు వేశామని బాధపడుతున్నారు. ఆరు గ్యారెంటీలు, మోసపు వాగ్ధానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు వారికి అర్థమవుతున్నది. మాకు గులాబీ జెండానే దిక్సూచి అని, కేసీఆర్ అండ అనే స్థాయికి వచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాలు, వార్డుల వారీగా ప్రజలు తరలిరావాలి. వార్డు, గ్రామ కమిటీల ఏర్పాటు చేసుకుంటూ సభ్యత్వాలు నమోదు చేయాలి. పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు, కోమటిరెడ్డి అనుచరులకు భయపడేది లేదు.
-కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అడ్డ. వచ్చే స్థానిక ఎన్నికలలోపు పార్టీని మరింత బలోపేతం చేయాలి. రజతోత్సవ సభతోపాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలి. స్థానికంగా వస్తున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేయాలి. కాంగ్రెస్ చేసిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలి. అధికారంలో లేనప్పుడే 20లక్షల మందితో సభ పెట్టిన ఘనత బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఉన్నది. 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలి.
-బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్
టీఆర్ఎస్ అనేక ఉద్యమాలు, సభలు పెట్టి పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకుంది. ప్రజల ఆశ్వీరాదంతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ర్టాన్ని మాజీ సీఎం కేసీఆర్ అన్ని రంగాలను దేశంలోనే అగ్రభాగంలో నిలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. కానీ కాంగ్రెస్ పదహారు నెలల్లోనే తెలంగాణను కుదేలు చేసింది. వ్యవసాయ రంగం అస్తవ్యస్తమైంది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ఇంత దారుణంగా ప్రజలను వంచించిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగాలి. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి.
– ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ