నల్లగొండ ప్రతినిధి, నవంబర్29(నమస్తే తెలంగాణ) : అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమ రోజులని తలపించేలా దీక్షా దివస్‌లు కొనసాగడం విశేషం. ఆయా జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ సైన్యం, ఉద్యమకారులు, అభిమానులు ఉదయం నుంచే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. దాదాపు ప్రతి గ్రామం నుంచి దీక్షా దివస్‌లో పాల్గొనేందుకు తరలిరావడం కనిపించింది.
ఉద్యమ కాలంలో ఉద్యమ నేత కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఊర్లకు ఊర్లకే కదలిన మాదిరిగా నేటి దీక్షా దివస్‌లోనూ ప్రతి ఊరూ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కదలివచ్చారు. పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంగా కూడా నెరవేరినైట్లెంది. దీక్షా దివస్ ప్రాంగణాల్లోనూ యువత భారీగా సందడి చేసింది. మరోవైపు కళాకారుల ఆటపాటలు సైతం అలనాటి ధూంధాంలను తలపిస్తూ ఆ ప్రాంతాన్ని దద్దరిల్లేలా చేశారు. ఆనాటి ఉద్యమకారులు నేతల ప్రసంగాల్లో పలుమార్లు భావోద్వేగాలకు గురవుతూ కనిపించారు. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడతూ ఆమరణ దీక్షకు పూనుకోవడం… కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భం..
ఇలా ఒక్కో ఘట్టాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వివరిస్తుంటే ఆ నాటి ఉద్విగ్నభరిత పరిస్థితులను తలచుకుంటూ భావోద్వేగాలతో పలువురు కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది. జగదీశ్‌రెడ్డి కూడా ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి గురవుతుండగా మాటలు పెకలలేదు. ఆనాటి ఉద్యమ పరిస్థితులను తలుచుకుంటూ కేసీఆర్ అకుంఠిత దీక్షను చాటిచెప్తూ భవిష్యత్తు తరాలకు రాష్ట్ర సాధన విశేషాలను, ఆనాటి పోరాట స్ఫూర్తిని రగిలించేలా దీక్షా దివస్ కొనసాగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో దివస్ జిల్లా ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ ప్రాంగణాలన్నీ ప్రారంభం నుంచి ముగింపు వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులతో సందడిగా మారాయి.
ఆంధ్రా పాలకుల మోసాన్ని గుర్తించిందే కేసీఆర్
ఆంధ్రా పాలకులు ఎక్కువ నిధులను నీళ్లను, ఉద్యోగాలను అక్కడి వారికే ఇవ్వడం గుర్తించిన కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి రాష్ట్ర సాధన కోసం పార్టీ ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వాలని వారితోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు ఎంతో అన్యాయం చేశాయి. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణం, 24గంటల విద్యుత్, చెరువుల పునరుద్ధరణతో సశ్యాశామలం చేశారు. నల్లగొండ ఫ్లోరైడ్ బాధతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవించిన వారి బాధ వర్ణణాతీతంగా ఉండేది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ప్రజలు స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటం మూలంగానే నేడు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడకి వలసలు వస్తున్నారు.
-మన్నె శ్రీనివాస్‌రెడ్డి,మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ
చివరి అస్త్రంగానే దీక్షలోకి దిగిన కేసీఆర్
2001లో రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కేసీఆర్ అనేక ఉద్యమాలు చేశా రు. పదవుల త్యాగాలు చేసినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఇవ్వకపోవడంతో చివరి అస్త్రంగా కేసీఆర్ దీక్షకు దిగారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ, టీడీపీ సైతం రాష్ట్రం ఇవ్వొద్దని ఒత్తిడి చేశాయి. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు దీక్ష చేయడం వల్లే రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ర్టాన్ని ఎవ్వరూ ఇవ్వలేదు, కేసీఆర్ వల్లే వచ్చింది.
– రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమానికి ఒక జ్వాల దీక్షా దివస్
తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది. మాలాంటి యువకులను కేసీఆర్ ప్రోత్సహించడంతోనే వేలాదిగా, లక్షలాదిగా యువతరం ఉద్యమంలోకి వచ్చారు. ఆయన చేసిన దిశానిర్దేశంతో ఉడుకు రక్తమైనా శాంతియుతంగా ఉద్యమాలు చేశాం. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అంటూ తన ప్రాణాన్ని పణంగా పెట్టడంతో తెలంగాణ మొత్తం ఏకమైంది. కేసీఆర్ కోసం రాష్ట్రపతిగా పని చేసి రిటైర్ అయిన ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో కేసీఆర్‌కు ఒక పేజీని కేటాయించారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమాన్ని ముద్దాడే వరకు చివరి వరకు పోరాడిన తీరు.. తానే పాలించిన సందర్భం ఒక్క కేసీఆర్‌కు తప్ప మరెవరికీ లేదని చెప్పిండు.
– డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ మెడలు వంచడం వల్లే తెలంగాణ వచ్చింది
1969లో జరిగిన ఉద్యమంలో వేల మంది నేలకొరిగినా, మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా పట్టించుకోకుండా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసింది. కేసీఆర్ ఆ పార్టీ మెడలు వంచడం మూలంగానే ఢిల్లీ పెద్దలు దిగొచ్చి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయాలో రూపకల్పన చేసిన కేసీఆర్ పదేళ్లలో ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతాలు సృష్టించారు. ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణను ఏడాది లోనే 29, 46 జీఓలతో నిరుద్యోగులను.. పీఆర్సీ, డీఏలతో ఉద్యోగులను.. పింఛన్లతో వృద్ధులను, రుణమాఫీ, రైతు భరోసాతో రైతులను మభ్యపెట్టి మోసం చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను నిలదీయాలి. వచ్చే నెలలో నల్లగొండకు వచ్చే ముఖ్యమంత్రి రూ.3వేల కోట్లు ఇవ్వాలి.
– కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే