సూర్యాపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ‘దశాబ్దాల తరబడి వెనుకవేయబడడంతో మెజారిటీ ప్రజలు ఒక్కపూట భోజనం చేసి జీవించడానికి నానా అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు తెచ్చింది కేసీఆరే. వెలుగులు తెచ్చింది కేసీఆరే. పద్నాలుగేండ్లపాటు నిరంతరాయంగా శాంతియుత ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాటైతే ఒనగూరే లబ్ధిని విడమర్చి చెప్పేవారు. తెచ్చిన తెలంగాణ ఎలా ఉంటుంది? తమకు ఏం జరుగుతుంది? తెలంగాణ వస్తే నిజంగా అన్నీ వస్తాయా? అనే అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేస్తూ ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చారు’ అని తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నాటి ఉద్యమ సంఘటనలు, కేసీఆర్‌తో ఉన్న అనుబంధం, ఆయన మానవీయ కోణాలను గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వ్యూహాలపై నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా తెలిపారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
నాటి ఉద్యమ కాలంలో కేసీఆర్ ప్రతి నిత్యం మేధావులు, రాజకీయ నాయకులు ఇతరులతో దాదాపు 5 నుంచి 18 గంటలపాటు చర్చలు చేసేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలో అన్నీ చేశారు. అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి చివరకు కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నాటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెచ్చిన తెలంగాణను ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా, రాష్ట్రం వస్తే తమకు ఏదో లబ్ధి జరుగుతుంది అనుకున్నట్లుగా ప్రతి మనిషికి ఏదో ఒక రూపేన ఫలితాలను అందించారు. ఒకరికి వచ్చింది, మరొకరికి రాలేదన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పద్ధతిన అందించింది కేసీఆర్ పాలన.
అత్యధిక లబ్ధి ఉమ్మడి నల్లగొండ జిల్లాకే..
తెలంగాణ రాష్ట్ర సాధనతో అత్యధిక లబ్ధి చేకూరింది ఉమ్మడి నల్లగొండ జిల్లాకే. ఈ జిల్లా అంటే కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం. ఐదు దశాబ్దాల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని మిషన్ భగీరథ పథకంలో ఆరేండ్లలోనే నామరూపాల్లేకుండా పారదోలింది కేసీఆరే. ఉమ్మడి పాలనలో దేశంలోనే శాశ్వతమైన కరువు జిల్లాగా మారిన నల్లగొండను అన్నపూర్ణగా మార్చారు. ఐదు లక్షలకుపైగా బోరు బావులు ఉన్న రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో అత్యధిక లబ్ధి చేకూరింది. రైతుబంధు, రైతు బీమాతో ఎక్కువ లబ్ధి ఉమ్మడి నల్లగొండ రైతులు పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం కూడా సూర్యాపేటకే దక్కింది. మరో వైపు నాగార్జునసాగర్ ఆయకట్టుకు గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ మన హక్కుగా నీటిని సాధించుకోగా ఇంకోవైపు మూసీని ఆధునీకరించడం ద్వారా జిల్లాలో మూడు నదులతో 10 లక్షలకు పైగా ఎకరాల భూమిని సాగులోకి తెచ్చుకున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా 2023 నాటికి 40 లక్షల టన్నులకు చేరుకుందంటే ఈ ఘనత కేసీఆర్‌ది కాకుండా మరెవరిది. దేశంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి సాధించింది నల్లగొండ, ఇది కేసీఆర్‌కు నల్లగొండపై ఉన్న ప్రత్యేక దృష్టి. ఓ వైపు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మించి, మరో వైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అభివృద్ధి ఏంటో చూపించారు. ఉమ్మడి నల్లగొండను మూడు జిల్లాలు చేయడం ద్వారా ప్రజలకు పాలను చేరువ చేశారు. జిల్లాలో మెడికల్ కళాశాల తెచ్చి మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు.
ఆరేండ్లలోనే ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా..
తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఆకలి చావులు, ఆత్మహత్యల ప్రాంతంగా ఉండగా ఆ తర్వాత ఆరేండ్లలోనే అన్నపూర్ణగా మార్చడం అంటే కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం. రాష్ట్ర ఆవిర్భావం అయిన 2014లో 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా 2020 నాటికే రాష్ట్రంలో మూడు కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి రావడం కేసీఆర్ గొప్పతనం. తెలంగాణ వేరైతే చీకట్లు కమ్ముకుంటాయి, ఊర్ల నుంచి రైతులు వలసలు పోవాల్సి వస్తదని, పోయిన రజాకార్లు తిరిగి వస్తారని సమైక్యవాదుల కుట్రలను పటాపంచలు చేశారు. రానేరాదన్న కరెంటును పోనే పోదన్న స్థితికి తీసుకువచ్చారు. మూడేండ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో 24 గంటల విద్యుత్, రైతులకు 2017 నుంచి 2023 వరకు పూర్తిగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు.