సూర్యాపేట, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైతుబంధు అడిగినోళ్లను చెప్పులతో కొట్టాలని అంటాడు. సమస్యలపై ప్రశ్నించినోళ్లపై దాడులు చేయిస్తూ ఆటవికుడిలా ప్రవర్తిస్తున్నాడు. భువనగిరి మండలంలో జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం’ అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధి నిరోధకుడు కోమటిరెడ్డి అని, మెడికల్ కళాశాల తెస్తానని చెప్పి నాలుగుసార్లు గెలిచి మోసం చేశాడని అన్నారు. నిజాం హయాంలో వేసిన రోడ్లు తప్ప ఆయన హయాంలో ఒక్క రోడ్డు వేయలేదని తెలిపారు. మాధవరెడ్డి మంచి నాయకుడే కానీ.. ఆయన కుమారుడు సందీప్‌రెడ్డి ఓ బచ్చా అని కోమటిరెడ్డి అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికిన కోమటిరెడ్డి.. ఆయన వెంట ఉన్న వారికి సిగరెట్లు తెచ్చి ఇచ్చినోడివి.. అసలు ఆయన బతుకేందో గుర్తెరగాలని అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతుంటే ఏదో చిల్లరగాడు, చిల్లర మాటలు అనుకున్నాం.. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత హీనస్థాయికి దిగజారి మంత్రి అనే విషయం గుర్తెరగకుండా ఊరకుక్కలా మొరుగుతున్నాడని ధ్వజమెత్తారు.
యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై రెచ్చగొట్టి దాడి చేయించి జైళ్లో వేయాలని పోలీసులకు హుకూం జారీ చేయడం.. ఆ వెంటనే ఓ పోలీసు సందీప్‌రెడ్డిని నెట్టివేయడం పట్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమంలో ఉన్న నాడు వైఎస్ఆర్ బూట్లు నాకిన కోమటిరెడ్డి.. అధిష్టానంలో ఒక నాయకుడి కాళ్లు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకుంటే ఇష్టంలేని కిరణ్‌కుమార్‌రెడ్డి తన క్యాబినెట్ నుంచి తన్ని తరిమేయబోతే రాజీనామా ట్యాగ్ తగిలించుకొని నాటకాన్ని పండించాడని మండిపడ్డారు.
‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంకా కొంతమంది కాంగ్రెసోళ్లు విసునూరు దొర, నిజాం కంటే పెద్దవాళ్లం అనుకుంటున్నారు.. నల్లగొండ జిల్లా చైతన్యం ముందు మీరు దేనికీ పనికిరారు’ అని హితవు పలికారు. ‘వాస్తవానికి మంత్రి పదవి తనకే రావాల్సి ఉన్నదని, రేవంత్‌రెడ్డి బెడ్రూంలోకి వెళ్లి కాళ్లు పట్టుకొని బతిమాలితేనే నీకు మంత్రి పదవి వచ్చిందని.. నీ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై మాట్లాడితే నీ విషయాలు చాలా ఉన్నాయి.. ఇంకా విప్పుతా అన్నారు. తన 23 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని.. నీ వ్యక్తిగత జీవిత విషయాలు మాట్లాడితే వీధుల్లో కూడా తిరుగలేవని హెచ్చరించారు.