తిరుమలగిరి ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతోందని అడుగడుగునా అరాచకాలు ,దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూసి భయపడుతోందని అన్నారు. అందుకే రేవంత్‌రెడ్డితో చేతులు కలిపిందన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, కేటీఆర్‌పై పెట్టిన కేసులు పనికి మాలినవి అని వాటిలో పస లేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని, కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం బీ టీంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు జరిగాయని, కిడ్నాప్‌లు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ,బీజేపీలు తోడు దొంగలని, ఆ రెండు పార్టీలు చేతులు కలిపి, మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నాయని అన్నారు. బీజేపీ ,కాంగ్రెస్ కలిసి రాష్ర్టాన్ని దోచుకుంటున్నాయని అన్నారు. అలాగే కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎన్నిదాడులు చేసినా ,కేసులు పెట్టినా తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారన్నారు. రాబోయే రోజలన్నీ బీఆర్ఎస్వేనని, వచ్చేది తమ ప్రభుత్వమేనని ఇప్పటికే జనం నిర్ణయించుకున్నారని అన్నారు.
గులాబీ జెండా ఎగిరింది.. మాజీ ఎమ్మెల్యే గాదరి
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరిందని, సగానికి పైగా నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీలు గెలుచుకున్నామని అన్నారు. తన హయాంలో తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.33 కోట్లు మంజూరు చేయిస్తే వాటిని నిలిపివేశారన్నారు. నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సామేల్ దందాలు, దోపిడీలు ,దాడులు ఎక్కువయ్యాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదన్నారు.తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్లం ..కాంగ్రెస్ దొంగలకు భయపడే ప్రసక్తే లేదు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో గెలిచి చూపిస్తామని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.