‘నకిరేకల్ నియోజవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. కాల్వలు, బ్రిడ్జిలు నిర్మించాం. కొత్త ఆస్పత్రుల భవనాలు నిర్మిస్తున్నాం. ప్రజలకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెస్తున్నాం. నాలుగున్నరేండ్లలో ప్రతి ఒక్కటీ చేశాం. ప్రజలే మా బలం.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయం సాధిస్తా.. మరింత అభివృద్ధికి తోడ్పడుతా’ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
– నకిరేకల్, ఆగస్టు 24
నమస్తే : నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశంపై..
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పనిచేసేందుకు నాకు అరుదైన అవకాశం లభించింది. అటువంటి అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నా. గత ఐదేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నా. ప్రజలకు సేవ చేయడానికి సీఎం కేసీఆర్ మరో అవకాశం ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మూడు నెలలు ముందుగా ఒకేసారి 115 మందికి టికెట్లు ప్రకటించిన పార్టీ ఇప్పటి వరకు లేదు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కాబట్టే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్ గెలుపునకు ఇదే నిదర్శనం.
నమస్తే : నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు?
ఎమ్మెల్యే : నకిరేకల్ నియోజవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. 1000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. నార్కటపల్లిలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు రూ.200 కోట్లు మంజూరు చేయించి ట్రయల్ రన్ సక్సెస్ చేయించడంలో సఫలీకృతులమయ్యాం. ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.100 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించాం. నకిరేకల్‌లో ఉన్న 30 పడకల దవాఖానను 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయించాం. నూతన భవన నిర్మాణానికి రూ.32 కోట్లతో పనులు ప్రారంభం కాగా మరో 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. నకిరేకల్ పట్టణంలో రూ.26 కోట్లతో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు నిర్మాణంలో ఉన్నాయి. నార్కట్‌పల్లి పట్టణంలో రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాం. రూ.6 కోట్లతో నకిరేకల్ కాలంవారి కుంట మినీట్యాంక్ బండ్ మొదటి దశ పనులు పూర్తయ్యాయి.
నమస్తే : నియోజకవర్గ ప్రజలకు హామీలు ఏం ఇవ్వబోతున్నారు?
ఎమ్మెల్యే : ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్, సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నకిరేకల్ మండలంలోని మండలాపురం చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.6.03 కోట్ల మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. మండలంలోని మూసీ ప్రాజెక్టు 6.8 కిలోమీటర్ల నుంచి అర్ధవారిగూడెం, పాలెం బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం. నియోజకవర్గంలో 12 హెల్త్ సబ్‌సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మరికొన్నింటికి ప్రతిపాదనలు పంపగా వాటిలో నకిరేకల్ మండలం గోరెంకలపల్లి, మంగళపల్లి, నోముల, రామన్నపేట మండలంలోని సిరిపురం, లక్ష్మాపురం వెల్లంకి గ్రామాల్లోని సబ్ సెంటర్లకు 1.40 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం, నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన పనులు పూర్తి చేస్తాం. జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
నమస్తే : ఎన్నికల ప్రచారం ప్రారంభించారా?
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించిన రోజునే ప్రచారం ప్రారంభించాను. దివంగత నకిరేకల్ మాజీ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించి ప్రచారం ప్రారంభించా. నర్రా రాఘవరెడ్డి గారి స్ఫూర్తితోనే మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచా. మళ్లీ ఆయన ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో ప్రచారం మొదలుపెట్టాను.
నమస్తే : నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నారా?
ఎమ్మెల్యే : నిరుద్యోగుల కోసం నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఐటీ పరిశ్రమను నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
నియోజకవర్గంలో ప్రత్యర్థులపై మీ అంచనాలేమిటి?
ఎమ్మెల్యే : ఎవరినీ పోటీదారులుగా స్వీకరించను. ప్రజలు మావైపే ఉన్నరు. మా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలతో ప్రజల్లోకి వెళ్తాం. అవే మా గెలుపును నిర్ణయిస్తాయి. బీఆర్ఎస్కు ఎవరూ పోటీలో నిలిచే పరిస్థితి లేదు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితులను చూస్తున్నాం.
నమస్తే : బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని భావిస్తున్నారు?
ఎమ్మెల్యే : బీఆర్ఎస్ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇవాళ ఒక తెలంగాణ రాష్ర్టానికే కాదు, యావత్ దేశ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నరు. మా గెలుపునకు ఇదే నిదర్శనం. 2014లో బీఆర్ఎస్ 63 అసెంబ్లీ స్థానాల్లో, 2018లో 83 స్థానాల్లో గెలిచింది. 2023లో 100 సీట్లకు పైగా గెలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 సీట్లు గెలుస్తాం.
నమస్తే : ఎన్నికల సందర్భంగా ప్రజలతో పంచుకొనే కొన్ని అంశాలు..?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో 2,37,813 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతు బంధు, బీసీ, మైనార్టీ బంధు వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి. ఎన్నికల వేళ కొంతమంది అడ్డగోలుగా హామీలిస్తారు.. ఆగమాగం కాకుండా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలను కోరుతున్నా.