నల్లగొండ, ఆగస్టు 8 : మత్తు పదార్థాల వాడకం, నియంత్రణకు నేటి నుంచి ఈ నెల 14వరకు నిర్వహించనున్న మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం ఎస్పీ శరత్‌చంద్రతో కలిసి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేయాలని, ప్రధానంగా గంజాయి వల్ల జరిగే దుష్పరిణామాలు యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్లో అవగాహన నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం, చిత్ర లేఖనం, పాటల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఈఓను ఆదేశించారు. ఈ నెల 12న ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీలు నిర్వహించాలని, మున్సిపాలిటీ యంత్రాంగం మైకులు, పోస్టర్లు, వాల్ పేపర్లు, ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు.
13న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో ఆడియో, వీడియోల ద్వారా అవగాహన కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశ కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. 14న అన్ని శాఖల ఆధ్వర్యంలో ముగింపు సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మిషన్ పరివర్తన్ కింద పోలీస్స్టేషన్లలో ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఈ వారం రోజులు రెగ్యులర్‌గా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య, ఎక్సైజ్, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.