ఎండిన బోర్లు.. వట్టిపోయిన బోరింగ్లు.. ఇంకిన బావులు.. నెర్రెలుబారిన చెరువులు, కుంటలు.. ఎండాకాలం వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో కనిపించే దయనీయ దృశ్యాలివి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల వద్ద తెచ్చుకునే పరిస్థితి. వాడవాడలా బోరింగులు, ట్యాంకర్ల వద్ద బిందెలతో మహిళల పానీపట్టు యుద్ధాలు జరిగేవి. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. సర్కారు చేపట్టిన పనులతో నేడు ఎక్కడ చూసినా జల దృశ్యాలే కనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో నిండుకుండలా మారాయి. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భజలాలు ఉబికివచ్చాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దాంతో మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తాగునీటికే కాదు సాగునీటికీ ఇబ్బందులు లేవు..
CM KCR | యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ), ఏప్రిల్ 29 : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లకు పడని గోస లేదు. ఎండాకాలం వచ్చిందంటే వాడుకోవడానికి దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు దొరక్క కుటుంబాలు తిప్పలు పడేవి. బజారుకో, వీధికో ఓ బోరింగ్ ఉండేది. మంచినీళ్లయినా.. ఉప్పు నీళ్లయినా అందరికీ అవే దిక్కయ్యేవి. ఎండాకాలంల అందులోంచి కూడా నీరు సరిగా రాక మహిళలు బిందెలతో క్యూ కట్టేవారు. నీళ్ల కోసం సిగపట్లు తప్పేవి కావు. మగవారు సైకిళ్లపై వెళ్లి ఊరి చివరన ఉన్న బోరు నుంచి మంచినీళ్లు తెచ్చిన పరిస్థితులు అందరికీ గుర్తున్నాయి. ఆఖరికి నీటిని కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణలో ఈ బాధలన్నీ తప్పాయి. మండుటెండల్లోనూ ఇంటికే నీళ్లు వస్తున్నాయి.
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే మిషన్ భగీరథ ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాలకు గాను అంతర్గత పైప్‌లైన్, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం కోసం 729 గ్రామాలకు రూ. 220.34 కోట్ల అంచనా వ్యయంతో నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 808 పాత వాటర్ ట్యాంకులు ఉండగా, కొత్తగా 561 ట్యాంకులను నిర్మించారు. 3413 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయ్యింది. మొత్తం 1,55,932 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. జిల్లాలోని ఆలేరు, ఆత్మకూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూరు, గుండలా, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 568 ఆవాసాలకు ఘన్పూర్ గుట్ట రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు అందిస్తున్నారు. ఇక చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని 76 ఆవాసాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి నీటిని అందిస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజు 66.63 ఎంఎల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నారు.
నిండుకుండలా చెరువులు
చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందు లో భాగంగా చెరువుల పూడికతీత చేపట్టింది. దాంతో ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యానికి గురైన చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయి. పూడిక చేరి, కట్టలు కరిగి, నీరు నిల్వ లేకుండా బోసిన చెరువులు ఇప్పుడు నిండుకుండాల దర్శనమిస్తున్నాయి. ఎండాకాలంలోనూ జలకళను సంతరించుకున్నాయి. నాలుగు దశల్లో చెరువులను పునరుద్ధరించారు. జిల్లాలో సుమారు 900 చెరువులున్నాయి. ఒక్క భువనగిరి పరిధిలోనే 105 కోట్లతో సుమారు 300 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. దాంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భజల మట్టం కూడా పెరిగింది. పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయతో బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండటంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెక్ డ్యామ్‌ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో చెక్ డ్యామ్‌లను నిర్మించింది. చెక్ డ్యామ్‌లతో ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుతున్నది. ఫలితంగా ఎండాకాలంలోనూ నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. గ్రామాల్లో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరిగాయి. వాగులు, కాల్వల ద్వారా నీరు వృథాగా పోకుండా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్‌లను నిర్మించి జలనిధిని పెంపొందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో రూ. 30 కోట్లకు పైగా నిధులతో 10 చెక్ డ్యామ్‌లను నిర్మించింది. మరికొన్ని ప్రతిపాదిత దశలో ఉన్నాయి. దాంతో ఆయా గ్రామాల్లో చెక్ డ్యామ్‌లు సైతం నీటితో నిండి మత్తడి దుంకుతున్నాయి. ఏడాది పొడవునా పుష్కలంగా నీరు ఉంటున్నది. ఒకప్పుడు జలాలు లేక ఎండిన బోర్లు ఇప్పుడు నిండుగా పోస్తున్నాయి. సగటున ఐదు మీటర్ల లోతులోనే జలాలు కనిపిస్తున్నాయి. ఐదేండ్లలో 4.5 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఎక్కడ బోర్లు వేసినా గంగమ్మ ఉబికి వస్తున్నది.