కొండమల్లేపల్లి, ఆగస్టు 13 : గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలకు నీటి సమస్య లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లోని ప్రతి ఇంటి ఎదుట ఉదయం పూట కావాల్సినన్ని మిషన్‌భగీరథ నీళ్లు వచ్చేవి. ఇప్పుడు తాగునీళ్లు మహాప్రభో..! అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెళ్లి గ్రామంలోని తొలిమడుగు కాలనీలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు.
భగీరథ నీటిని గ్రామంలో సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక వాటర్ ట్యాంకును కూడా కట్టించింది. దీంతో కొన్నేండ్లు నీరు బాగానే వచ్చినా, రానురాను భగీరథ నీటి సరఫరా పూర్తిగా బంద్ అయింది. మిషన్‌భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడం, పంచాయతీ సైతం నీటి సరఫరా చేయకపోవడంతో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు, మహిళలు మంగళవారం రోడ్డెక్కి ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తమ కాలనీకి రెండేండ్లుగా మిషన్‌భగీరథ నీళ్లు రావడంలేదని, తాగునీటి కోసం రూ.20 పెట్టి ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిల్టర్ వాటర్ కొనుగోలు చేసే స్థోమత లేని వారు బోరునీళ్లు తాగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లల్లో బోర్లు లేక మిషన్‌భగీరథ నీటిపై ఆధారపడిన వారి పరిస్థితి వర్ణనాతీతం. ఉదయాన్నే కూలి పనులకు వెళ్లాల్సిన వారు సైతం తాగునీటి కోసం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
గతిలేక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వాయి గ్రామని వెళ్లి మిషన్‌భగీరథ నీళ్లు తెచ్చకుంటున్నారు. తాగునీళ్లు అందించాలని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రోడ్డుపై ఖాళీ బెందెలతో నిరసన వ్యక్తం చేశారు. కనీసం తాగునీటిని సక్రమంగా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళలు మండిపడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించకుంటే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం..
తొలిమడుగు కాలనీలో మిషన్‌భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. బోరు నీటిని తీసుకొచ్చే పరిస్థితి మళ్లీ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్‌భగీరథ నీరు సక్రమంగా వచ్చేవి. కాంగ్రెస్ వచ్చాక తాగునీటి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మా కాలనీలో మిషన్‌భగీరథ పైపులైన్ వేశారు. కానీ వాటి నుంచి బోరు నీళ్లే వస్తాయి. మిషన్‌భగీరథ నీళ్లు అసలే రావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో మిషన్‌భగీరథ నీరు సరఫరా చేస్తే బాగుండు.
-కాసర్ల వెంకటమ్మ, తొలిమడుగు కాలనీ, గుమ్మడవెళ్లి గ్రామం
బోరు నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నాం…
మిషన్‌భగీరథ నీళ్లు రాకపోవడంతో బోరు నీళ్లు తాగి రోగాలబారిన పడుతున్నాం. రెండేండ్లుగా కాలనీలో మిషన్‌భగీరథ తాగునీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీటి సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగునీళ్ల కోసం ఐదు కిలోమీటర్లు ఉన్న పాల్వాయి గ్రామాని వెళ్లి తీసుకోస్తున్నాం. లేకుంటే రూ.20 పెట్టి ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసలు నీటి కొరతే లేకుండే. చేతిగుర్తు పార్టీ ఎప్పుడు గెలిచిందో అప్పటినుంచి నీటి సమస్య మొదలైంది. మిషన్‌భగీరథ నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. అవి మొదలు బాగనే వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ బోరునీళ్లు, మిషన్‌భగీరథ నీళ్లను రెండింటినీ ఒకే ట్యాంకులోకి వదిలి సరఫరా చేసే వారు. ఇప్పుడు పరిస్థితి పోయి మొత్తానికి బోరునీళ్లే దిక్కాయ్యాయి. ఇప్పటికై కార్యదర్శి అధికారుల దృష్టికి తీసుకెళ్లి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.
-షేక్ లతిఫ్బి , తొలిమడుగు కాలనీ, గుమ్మడవెళ్లి