నల్లగొండ, నమస్తే తెలంగాణ మార్చి 22 : మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 2025 మే 7 నుండి 31వ తేదీ వరకు ఈ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఈ పోటీలో 140కి పైగా దేశాల నుండి సుందరీమణులు పాల్గొననున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తన గొప్ప వారసత్వం, శక్తివంతమైన సంస్కృతి, పర్యాటక ఆకర్షణలను ప్రదర్శించాలని ప్రణాళిక వేసింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ దీనిని తెలంగాణ గ్రామీణ సౌందర్యం, అలాగే సంప్రదాయాలను ప్రపంచ పటంలో ఉంచడానికి ఒక సువర్ణావకాశంగా భావిస్తోంది.
25 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం నగరంలోని 12 ప్రదేశాల్లో అలాగే వరంగల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరిలోని మరికొన్ని ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, ఇతర ప్రదేశాల సందర్శనలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ అంతర్జాతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్ర గొప్ప సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రదర్శించడానికి అదేవిధంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవకాశంగా భావిస్తుంది.
ఈ క్రమంలో ప్రపంచ బౌద్ధ పర్యాటకులను ఆకర్షించడానికి ఎంపిక చేయబడిన కృష్ణ నది ఒడ్డున ఉన్న నాగార్జునసాగర్ వద్ద గల బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. దీంతో మిస్ వరల్డ్ పోటీదారులు ఈ బౌద్ధ వారసత్వ ప్రదేశాన్ని అన్వేషించడానికి వివరణాత్మక టూర్ ప్లాన్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి అవసరమైన ఏర్పాట్లపై శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి బుద్ధవనంలో సమీక్ష నిర్వహించారు.
Miss World Beauty Pageant : బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు
సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు ధ్యానం నిమిత్తం బుద్ధ వనాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. వారు బుద్ధవనంతో పాటు, విజయ విహార్, నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించనున్నట్లు వెల్లడించారు. మే 12న బుద్ధపూర్ణిమ సందర్భంగా బుద్ధవనంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ధ్యానంలో పాల్గొనేందుకు మిస్ వరల్డ్ పోటీదారులు రానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాకారులతో స్వాగత కార్యక్రమం, డ్రోన్ షో వంటివి ఏర్పాటు చేయాలని, వారందరికీ అవసరమైన రాత్రి భోజనం, వసతి సౌకర్యాలు అన్నింటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, ఇందుకు సమగ్రంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీదారులకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం తరఫున చేస్తామని, వారికి అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పిస్తామని, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. బుద్ధవనం సందర్శించే ప్రపంచ సుందరి పోటీదారులందరికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని, ఆరోజు బుద్ధవనం వచ్చే వారికి పాసులను జారీ చేయడంతో పాటు, పోలీస్ సెక్యూరిటీని, అంబులెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఎండీ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ బుద్ధ చరిత వనం, బోటింగ్ పాయింట్, నాగార్జునసాగర్ డ్యామ్ తదితరాలను సందర్శించారు.
ఈ సమావేశానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, బుద్ధవనం ఓఎస్డీ సుబాన్ రెడ్డి, పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివనాగిరెడ్డి, పర్యాటకశాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాశ్, ఇబ్రహీం, పర్యాటక శాఖ ఇంజినీరింగ్ అధికారులు, అటవీశాఖ అధికారి సంగీత, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
Miss World Beauty Pageant : బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు