పాలకవీడు, ఏప్రిల్ 19 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఈ నెల 8, 9వ తేదీల్లో అధికారులు, నాయకులు అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకెపీ ఆధ్వర్యంలో మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో, అలాగే వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మరొక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10 రోజులు గడిచినా ఒక్క బస్తా ధాన్యం కూడా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శూన్యపహాడ్ గ్రామంలో రైతులు దొడ్డు రకానికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. పది రోజుల నుంచి ఆరబెడుతున్న కూడా అధికారులు తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో శనివారం పలువురు రైతులు ట్రాక్టర్ల బోరాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ప్రభుత్వ మద్దతు ధర అందుతుందని ఆశపడ్డామని, కానీ అధికారులు ఆశపెట్టి మోసం చేశారని పలువురు రైతులు ఆరోపించారు.
రెండు రోజులు వర్ష సూచన ఉండడంతో ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తోలుకుని మిల్లులకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఏపీఎం దుర్గాప్రసాద్, ఏఓ కళ్యాణ చక్రవర్తిని వివరణ కోరగా రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొనుగోలు చేయలేదన్నారు. నాణ్యమైన ధాన్యం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు.