డిసెంబర్ 27 : మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు(54) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కోటేశ్వర్రావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో కుటుంబసభ్యులు, మిత్రుల సహకారంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లేలోగానే ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని బంగారుగడ్డలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మృతుడి భార్య చైతన్య బంగారుగడ్డ కౌన్సిలర్‌గా ఉన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బీఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ బంగారుగడ్డకు వెళ్లి కోటేశ్వర్రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో కౌన్సిలర్ కోటేశ్వర్రావు, నాయకులు కరుణాకర్‌రెడ్డి, నల్లమోతు చైతన్య, నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. అమెరికాలో ఉన్న కోటేశ్వర్రావు కూతురు రావాల్సి ఉండడంతో గురువారం ఉదయం 9గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.