కోదాడ, సెప్టెంబర్ 02 : కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5.10 కోట్లతో నీటి పారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ డివిజన్ 4 సమీకృత కార్యాలయం నూతన భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పర్యవేక్షించే అధికారులకు కార్యాలయం నాలుగు అంతస్తులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.
భవిష్యత్‌లో భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను రూ.54.03 కోట్లతో నిర్మిస్తున్నామని, దీని ద్వారా అనంతగిరి మండలంలో గొండ్రియాల గ్రామంలో 609 ఎకరాలు, కొత్తగూడెంలో 190 ఎకరాలు, బొజ్జగూడంతండాలో 496 ఎకరాలు, శాంతినగర్ లో 585 ఎకరాలు, లకారంలో 231 ఎకరాలు, తిరువన్నారంలో 803 ఎకరాలు, మొగలాయి కోటలో 306 ఎకరాలు మొత్తం అనంతగిరి మండలంలో 3,219 ఎకరాలు అలాగే కోదాడ మండలంలోని 1,781 ఎకరాలు, చిమ్మిర్యాల గ్రామంలో 750 ఎకరాలు, తమ్మరబండపాలెం 550 ఎకరాలు, నల్లబండగూడెంలో 481 ఎకరాలు, మొత్తం దీని ద్వారా 2,138 రైతు కుటుంబాలకి చెందిన 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, ఇరిగేషన్ సీఈ రమేశ్ బాబు, ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ వాజిద్ అలీ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.