నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఈనెల 14వ తేదీన హాలియాకు రానున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. ఈ మేరకు స్థానిక హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ తో పాటు ఆధునిక పరిజ్ఞానంతో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. నియోజక వర్గంలోని ప్రతి పల్లే అభివృద్ధికి మరో రూ.120 కోట్ల ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇన్నేండ్లు నాగార్జునసాగర్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగలేదన్నారు. 2018 తర్వాతనే ఇక్కడ అభివృద్ధి మొదలైందన్నారు.
2018 నుంచి నిరంతరం ప్రజల సమస్యలను మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈ నెల 14న హాలియలో సభను ఏర్పాటు చేయనున్నామని టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.