వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్‌తో అసలు ఎవుసం సాగుతదా, రేవంత్‌కు ఎవుసం గురించి ఏమైనా తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. మూడు గంటల కాంగ్రెస్ వద్దు, మూడు పంటల బీఆర్ఎస్ కావాలి అని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రెండో రోజూ ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతు వేదికల్లో రైతుల సమావేశాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కాంగ్రెస్ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మంగళవారం దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల సమావేశాలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని వ్యవసాయం, రైతుల పట్ల కాంగ్రెస్ నేతల తీరును వివరించారు. సమైక్య పాలన, సీఎం కేసీఆర్ పాలనలోని స్థితిగతుల్లో తేడాలను చెప్పి కాంగ్రెస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై18)
నల్లగొండ ప్రతినిధి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నెల 17నుంచి పది రోజుల పాటు నిర్వహిస్తున్న సమావేశాల్లో రెండో రోజు పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం చందంపేట రైతు వేదికలో మూడు గంటల కాంగ్రెస్ వద్దు.. మూడు పంటల బీఆర్ఎస్ ముద్దు అంటూ రైతు సమావేశం జరిగింది. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల పట్ల కాంగెస్ వైఖరిని వివరిస్తూ ఆ పార్టీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 24గంటల
కరెంట్ కావాలని, బీఆర్ఎస్ వెన్నంటే ఉంటామంటూ రైతులు తీర్మానం చేశారు.
మిర్యాలగూడ మండలం తుంగపహాడ్‌లో జరిగిన రైతు యుద్ధ వేదిక సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతోపాటు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతోపాటు రైతులు కూడా ఇందులో మాట్లాడారు. రైతు బాగుండాలంటే బీఆర్ఎస్ సర్కార్‌ను కాపాడుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లి రైతువేదికలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే అస్సలు కరెంటే ఉండదంటూ ఆనాడు కాంగ్రెస్ పాలకులు దుష్ప్రచారం చేశారని, కానీ.. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నిరంతర ఉచిత కరెంటు ఇస్తున్నారని జడ్పీ చైర్మన్ నరేందర్‌రెడ్డి వివరించారు. రైతులకు అవసరమైన ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం, ఆపదలో ఆదుకునే బీమా పథకం, ఎరువులు, విత్తనాలు ఇలా అన్ని విధాలుగా అండగా ఉంటూ వ్యవసాయాన్ని నిలబెట్టారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ పలు తీర్మానాలను ఆమోదించారు. త్రిపురారం మండలం నీలాయిగూడెంలో ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ రైతు సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ ఆయకట్టు రైతులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 24 గంటల ఉచిత కరెంటుపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఎమ్మెల్యే భగత్ స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమావేశం జరిగింది. దీనికి ఆ క్లస్టర్ పరిధిలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మోసపు మాటలకు, అసత్యాలకు కాంగ్రెస్ పార్టీ మారుపేరని, వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల అన్నారు.
గతంలో వచ్చిరాని కరెంటుతో మొదటి మడి పారడమే గగనంగా ఉండేదని రైతులు చెప్పుకొచ్చారు. మూడు గంటల కాంగ్రెస్ వద్దంటూ తీర్మానం చేశారు. కోదాడ మండలం అల్వాలపురం రైతువేదికలో జరిగిన రైతు సమావేశానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హాజరయ్యారు. తెలంగాణ వస్తే చీకట్లే అంటూ చేసిన అసత్య ప్రచారాన్ని ఎత్తిచూపారు. రైతులంతా సంఘటితంగా ఉండి మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వద్దు
దేవరకొండ, జూలై 18 : తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ 3 గంటల విద్యుత్ ఇస్తామని చెప్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులకు నష్టం చేసే
ఆ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వద్దని పిలుపునిచ్చారు. మండలంలోని కొండభీమనపల్లి రైతు వేదికలో మంగళవారం రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ ఇవ్వాలనడం రైతులను మోసం చేయడమేనన్నారు. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాత్రి పూట కరెంటు ఇస్తే రైతులు బోరు, బావుల వద్ద నిద్ర కాసి పాముకాటుకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్ అందించడంతో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. రైతులు గ్రామాల్లో 24 గంటల విద్యుత్‌పై చర్చించి ఇతర పార్టీల నాయకులను రానివ్వద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి రెండు పంటలకు రూ.10వేల
పెట్టుబడి సాయం ఇస్తున్నారని, మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా అందిస్తున్నారని తెలిపారు.
మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువులు జలకళను సంతరించుకున్నాయని, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. అనంతరం రైతులంతా 24 గంటల విద్యుత్ అందించాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, సర్పంచులు అంజయ్య, రాజు, దీప్లానాయక్, బీఆర్ఎస్
మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నాయకులు మునుకుంట్ల వెంకట్‌రెడ్డి, మారుపాకుల సురేశ్‌గౌడ్, కడారి తిరుపతయ్య, కళ్యాణ్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
రైతుల ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్‌ది
సంస్థాన్ నారాయణపురం, జూలై 18 : కరెంట్, సాగునీరు ఇవ్వకుండా రైతులను గోసపెట్టి ప్రాణాలు తీసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక నినాదానికి నిరసనగా మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తూ.. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులను గుండెల్లో పెట్టి చూసుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయంపై అవగాహన లేకుండా మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, 24 గంటల కరెంటు వద్దు.. 3 గంటలు చాలన్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్ మూడు పంటలకు నీళ్లు అందించాలని తాపత్రయ పడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంట్ ఇవ్వడానికి తాపత్రయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలకు నీళ్లిచ్చే సీఎం కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలని రైతులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై గ్రామాల్లో రైతులు చర్చ చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సర్పంచులు శ్రీహరి, సుర్వి యాదయ్య, కట్టెల భిక్షపతి, పాండురంగానాయక్, దేవీలాల్, ఒగ్గు గణేశ్, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
3 గంటల కరెంటుకు 30 గుంటలు గూడ పారదు
రైతు కష్టం తెల్సినోడు ఎవడూ మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడడు. మూడు, నాలుగు గంటల కరెంట్ ఇస్తే స్టార్టర్ల కాడా తెల్లార్లు పడుకోవాలె. మూడు గంటల కరెంట్‌కు 30 గుంటల భూమి కూడా పారదు. ఎద్దు, వ్యవసాయం తెలిసినాయనే మాట్లాడుతున్నడా ఈ మాటలు. కష్టపడి పంట పండిస్తే తెలుస్తది విలువ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లచ్చన్నరకే ఎకరం భూమి అమ్మిన. అయ్యాల కొనే దిక్కే లేదు. నీళ్లు రాకపాయె.. కరెంట్ లేకపాయె. ఇయ్యాల మా ఊళ్ల పొలం కొనాలంటే 50 లచ్చలు. నిరంతరం కరెంట్ ఉంటున్నది. కాల్వ నీరు వస్తున్నది. పెట్టుబడి సాయం ఇస్తున్నరు. ఊళ్లనే వడ్లు కొంటునే. కర్మకాలి చనిపోతే రైతన్నకు రూ.5లక్షలు వస్తున్నాయి. రైతు బాగుండాలంటే ఈ ప్రభుత్వమే ఉండాలి. కష్టాలు తెలిసిన సీఎం కేసీఆరే ఉండాలి.
-సత్యనారాయణ, రైతు, అన్నారావుక్యాంపు, త్రిపురారం (నమస్తే తెలంగాణ
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దు
నేను చాలా కాలం నుంచి చూస్తున్న గతంలో ఏ ప్రభుత్వమూ 24 గంటల కరెంటు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇది సాధ్యమైంది. రేవంత్‌రెడ్డి చాలా మోసగాడు. కేసీఆర్ నుంచి రైతులను దూరం చేయాలని అలా మూడు గంటల కరెంటు ఉంటే చాలు అంటున్నాడు. ఆయనకు వ్యవసాయం గురించి తెలియదు. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. పాత రోజులు రాకుండా ఉండాలంటే సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాలి.
– జక్కుల జంగయ్య, రైతు, ముడుదండ్ల, చందంపేట మండలం
కాంగ్రెస్ వస్తే వ్యవసాయం బీడుపెట్టాల్సిందే..
నేను 20ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. నాకున్న ఆరెకరాల పొలం కాల్వ నీళ్లతో పారుతుంది. కాల్వ నీళ్లు రానప్పుడు సేద్యం చేసుకునేందుకు రెండు బోర్లు వేసిన. గతంలో చంద్రబాబు పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడమ కాల్వకు నీరు వదలనప్పుడు పొలాలు తడుపుకోవాలంటే కరెంట్ సక్కగ లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. నిండుగా నీళ్లు పారక పంటలు బాగా పండకపోయేవి. పగలు, రాత్రి మూడు గంటల కరెంట్ ఇవ్వడం వల్ల పట్టిన మడే మళ్లీ పట్లేది. లోఓల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పొలాలు ఎండి తీవ్ర నష్టం జరిగేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలను పారదోలిండు. ఉచితంగా 24గంటల విద్యుత్‌తోపాటు రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు, రైతుబీమా ఇస్తుండడంతో రైతు కుటుంబాలకు భరోసా లభిస్తుంది. అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పాలన వస్తే రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామని ముందుగానే చెప్తుండు. రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి బాబు అడుగుజాడల్లోనే నడుస్తుండు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే రైతులు వ్యవసాయం వదులుకోవాల్సిందే. రైతులు ఆగం కాకుండా ఉండాలంటే సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలి.
– చంద్రశేఖర్‌రావు, రైతు, ఊట్లపల్లి, మిర్యాలగూడ మండలం
ఎన్నడన్న పోతే తెలుస్తది కరెంట్ గురించి..
ఎప్పుడూ వ్యవసాయం చేయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరెంటు ఎంత అవసరమో ఆయనకు ఏం తెలుసు. ఆయన నా పొలం దగ్గరికి వస్తే ఎన్ని గంటలు అవసరమో తెలుస్తుంది. 24 గంటల కరెంటు ఇచ్చే ముఖ్యమంత్రి కెసీఆర్ మాకు కావాలి. గతంలో 7 గంటలు ఇచ్చిన కరెంటుకు కుటుంబాన్ని వదిలి రాత్రిళ్లు పొలం దగ్గరే ఉండాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినంక రాత్రి వేళల్లో పొలం కాడికి పోకుండా ఇంటి వద్ద దర్జాగా ఉంటున్నాం.
– కడారి అచ్చయ్య, కొండభీమనపల్లి, దేవరకొండ మండలం
కరెంటు కోసం కావలి లేకుండా పోయింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోసం గంటల తరబడి బోరుబావుల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసేవాళ్లం. రాష్ట్రం ఏర్పడినంక సీఎం కేసీఆర్ తొలిసారి తీసుకున్న మంచి నిర్ణయం 24 గంటల కరెంటు ఇవ్వడం. దీంతో కరెంటు కష్టాలు తీరాయి. బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేకుండా పోయింది. నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల మోటర్లు కాలిపోవడం లేదు. కరంటు ఉచితంగా ఇవ్వడంతో బోర్లు వేసుకొని ఉన్న భూమినంతటినీ సాగులోకి తెచ్చుకున్నాం. పుష్కలంగా కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– లావూడి చావలీ, రైతు, లావూడితండా (మిర్యాలగూడ రూరల్)
మూడు గంటలు చాలన్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్‌కు సరైన సయయంలో బుద్ధి చెబుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. మూడు గంటల కరెంటు చాలన్న రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రైతుల కష్టాలు తెలుస్తున్నాయి. మాకు మూడు గంటలు వద్దు.. 24 గంటల కరెంటు కావాలి. మూడు పంటలు పండాలి.
– ధనావత్ శ్రీను, రైతు, దుబ్బతండా (మిర్యాలగూడ రూరల్)
మూడు గంటల కరెంట్ అన్నోడిని ముళ్లు కర్రతో బాదాలె..
మూడు గంటల కరెంట్ ఇస్తే 30 బోర్లు ఒకేసారి నడిస్తే తీగలు యాడ తెగి పడ్తయో, ట్రాన్స్ఫార్మర్ యాడ కాలిపోతదో తెలియదాయె. కరెంట్ వచ్చే యాళ్లకు నిద్రమత్తులో ఉండి స్టార్టర్‌లో చేయి పెడితే సత్తమో బతుకుతమో తెలియకపాయె. మూడు గంటలన్న మనిషికి రైతెట్ట బతుకుతడో తెల్సా. మూడు గంటల కరెంట్ అన్నోడిని ముళ్లు కర్రతో బాదాలె. నేలను నమ్ముకున్న రైతు గిట్లాంటి మాటలు మాట్లాడడు. రైతు బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీ రావాలె. కేసీఆర్ సారు 24గంటల కరెంట్ ఇస్తుండు. పెట్టుబడికి పైసలిస్తుండు. పండించిన వడ్లకు మద్దతు ధరి ఇచ్చి కొంటుండు.
– ఎలక్షన్రావు, రైతు, కంపాలపల్లి, త్రిపురారం మండలం