ధనబలంతో మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవాలని కుట్ర చేస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం తాస్కానిగూడెం, బోడంగి పర్తి గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు.
బోడంగిపర్తిలో మైనార్టీ నేత రజబ్ అలి ఆధ్వర్యంలో పలువురు మైనార్టీ నేతలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఈ ఎన్నిక వచ్చినట్లు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బీజేపీ అభ్యర్థిని అంతా కలిసికట్టుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్టర్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. బీజేపీ దుష్ప్రచారం తిప్పి కొట్టాలని చెప్పారు. గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారంలో యువత, మహిళలు, వృద్ధులు ఉత్సాహంతో పాల్గొంటున్నారని తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. గొల్ల కురుమల కోసం గొర్రెల పంపిణీ చేపట్టి వారి ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు భీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయన్నారు. ఏం మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు ఓట్ల ఆడుగుతారని? మంత్రి ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కన్నా మంచి పథకాలు అమలు చేస్తున్నాం అని ఓట్లడుగుతారా? అని ఎద్దేవా చేశారు.
విపక్షాలకు తమకు ఓట్లేయాలని అడిగేందుకు ఎలాంటి అంశాలు లేవని, బీజేపీకి ఓటు వేస్తే వృధా అవుతుందని తెలిపారు. ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలే గ్రామాల్లో చెప్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకన్నా ముందు మునుగోడుకు తాగునీరు ఇచ్చి విషపు నీళ్ల నుండి విముక్తి కలిగించింది కేసీఆర్ అని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయని స్పష్టం చేశారు.