మిర్యాలగూడ/మిర్యాలగూడ రూరల్/తిప్పర్తి, మార్చి 20 : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మిర్యాలగూడ మండలం గూడూరులో సీతారామచంద్ర ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటాద్రిపాలెంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల ప్రాంభోత్సవాల్లో ఆయన పాల్గొనేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మార్గ మధ్యంలో రైస్ మిల్లుల ప్రధాన ద్వారం వద్ద ధాన్యం లోడుతో నిల్చున్న ట్రాక్టర్లను చూసి మంత్రి తన వాహనం ఆపి రైతులతో మాట్లాడారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సిండికేట్ అయి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి వెంటనే మిల్లుల వద్దకు రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే మిల్లులను సీజ్ చేయాలని ఆదేశించారు. అలాగే తిప్పర్తి మండలంలోని సిలార్మియాగూడెంలో నిర్మిస్తున్న రామాలయ పనులను మంత్రి కోమటిరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులు కేతావత్ శంకర్‌నాయక్, శ్రీనివాస్, గాయం ఉపేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.