నేరేడుచర్ల, అక్టోబర్ 6 : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో సరితూగే రాష్ట్రం దేశంలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చింతలపాలెం మండలంలోని బుగ్గమాధవరం గ్రామంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణలక్ష్మి, 24 గంటల విద్యుత్, రైతు బంధు, బీమా పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్నేనని కొనియాడారు. గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశారన్నారు. చెత్త సేకరణకు పంచాయతీకి ఒక ట్రాక్టర్, సెగ్రిగేషన్ షెడ్ వంటివి నిర్మించారు. ముఖ్యంగా విద్యా ప్రమాణాలు మెరుగు పరిచి మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. నిరుపేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గుర్తుంచుకోవాలని సూచించారు. గత పాలకుల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగేండ్లలో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సైదిరెడ్డిదేనని కొనియాడారు. ఇంత వేగంగా అభివృద్ధి జరిగిన నియోజకవర్గం లేదన్నారు. ప్రతి ఇంటికీ వచ్చి సమస్య తెలుసుకునే నాయకుడు ఎమ్మెల్యే సైదిరెడ్డి అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి నాయకుడు మీ నియోజకవర్గానికి ఉండడం అదృష్టమన్నారు. ఇక్కడ ఎన్నో సార్లు గెలిచిన నాయకులు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ‘కొందరు నేను 35సార్లు గెలిచిన.. నేను సీఎం అవుతానని చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఒరిగేదేమీ లేదు’ అని విమర్శించారు. కుంటి గుర్రాన్ని పెట్టుకొని ముందుకు పోలేమని, అభివృద్ధి పరుగులు పెట్టాలంటే ఉరికే గుర్రాన్ని ఎంచుకోవాలని సూచించారు. గాడిదకు గడ్డేసి బర్రెను పాలు పిండితే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదో మాటలు చెప్పే ప్రభుత్వమేదో మీరే గమనించాలని సూచించారు.
60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే అది మీకు మీరు వేసుకున్నట్లేనని పేర్కొన్నారు. మనం వేసే ఓటు మన తలరాతను మారుస్తుందన్న మంత్రి ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 2019లో సైదిరెడ్డికి వేసిన ఓట్లు రూ.3500 కోట్లతో అభివృద్ధి పనులు చేయించాయన్నారు. నాలుగేండ్లలో ఇన్ని నిధులు తేవడం చరిత్రేనని పేర్కొన్నారు. సైదిరెడ్డిని గెలిపించక ముందు రహదారులు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఒకసారి అవకాశం ఇవ్వమనే మోసగాళ్లు వస్తారని వారిని నమ్మవద్దని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా మరోసారి ఎగరేస్తామన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు.
గత పాలకులు సాగర్ ఎడమ కాల్వ సాగు నీటి విషయంలో ఆంధ్రా పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సాగర్ ఆయకట్టు చరిత్రలో వరుసగా 16 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని కొనియాడారు. ప్రకృతి కనికరించకున్నా ప్రస్తుతం పంటలను కాపాడాలని ఉద్దేశంతో ఈ రోజు సైతం సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశామన్నారు. 2014కు ముందు సూర్యాపేట జిల్లా ధాన్యం దిగుబడి 3.50లక్షల టన్నులు ఉంటే ప్రస్తుతం 45లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. తెలంగాణలో గతంలో 45లక్షల మెట్రిక్ టన్నల దిగుబడి ఉంటే ప్రస్తుతం 1.50లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో సైతం వ్యవసాయానికి 6గంటలిచ్చి బిల్లులు వసూలు చేస్తే మన దగ్గర 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ రెండవ దఫా విద్యా, వైద్య రంగాలపై దృష్టి సారించారని తెలిపారు. అందులో భాగంగా వచ్చినయే 32 మెడికల్ కాలేజీలు, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు అన్నారు. గత పాలకులు హయాంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు సంఖ్య 50ఉంటే ప్రస్తుతం వెయ్యి మందికి చేరినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో సైతం ప్రసూతి సేవలు అందుతుండడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా ప్రజల రుణం తీర్చుకోవడానికి సైదిరెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. ‘సార్ అని పిలిపించుకునే నాయకులు కావాలో.. అన్నా అంటే ఆప్యాయంగా దగ్గరికి వచ్చే సైదిరెడ్డి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ కొత్తమద్ది వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ రంగాచారి, ఎంపీటీసీ సైదిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
‘ఇక్కడే పుట్టి… ఇక్కడే పెరిగిన మీ బిడ్డనైన తనను ఆశీర్వదించి గతంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రూ.3500కోట్లతో నియోజకర్గాన్ని అభివృద్ధి చేశా’ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశానన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మరోసారి తనను అశీర్వదించి గెలింపించాలని కోరారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాత్రి తాగి పొద్దున్నే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. చుట్టపు చూపుగా వచ్చే నాయకులు అవసరం లేదని, నిరంతరం ప్రజల మధ్యన ఉండే యువ నాయకుడు సైదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.