‘మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్. అనేక సంక్షేమ పథకాలను వారి పేరున అమలు చేస్తూ అతివలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా నిలుస్తున్న మహిళా రక్షకుడు మన ముఖ్యమంత్రి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మహిళలను గౌరవించడంలో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని తెలిపారు. మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదన్నారు. సూర్యాపేటలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. అనంతరం మహిళా దినోత్సవ కానుకగా 14,201 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు.
సూర్యాపేట టౌన్, మార్చి 8 : మహిళా పక్షపాతిగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను మహిళలపేరుతో అందిస్తుండడంతో పాటు వారిని అన్ని రంగాల్లో రాణించేలా ఆర్థికంగా ప్రోత్సహిస్తూ.. అండగా నిలుస్తున్న మహిళా రక్షకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు.సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బుదవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. అనంతరం జిల్లాలో ఉన్న 14,201 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ. 750 కోట్ల విలువగల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. మహిళలను గౌరవించడంలో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. దేశంలోనే మరెక్కడాలేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో సమాజంలో ఆడ బిడ్డలు, మహిళలకు రక్షణ పెరిగిందన్నారు.
ఆరోగ్య మహిళా మరో వరం
కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఒంటరి మహిళా పింఛన్ల పాటు ఆడబిడ్డలకు కేసీఆర్ అందిస్తున్న మరో వరం ఆరోగ్య మహిళా అని మంత్రి కొనియాడారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని వారికి కావాల్సింది ప్రోత్సాహం అన్నారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని నమ్మిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి సాధికారిత లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతుందన్నారు.
మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్ధ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. అనంతరం ఆరోగ్య మహిళా పోస్ట ర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, ఉద్యోగుల ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, ఆదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసి మామిడి అనిత అంజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ్ నాయక్, జిల్లా మహిళా అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.