సూర్యాపేట. మే 1 (నమస్తే తెలంగాణ) ;ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, అసంఘటిత రంగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి పలుచోట్ల మేడే వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్కేవీ, బీఆర్టీయూ జెండాలను ఎగురవేణారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కార్మికులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. మోదీ సర్కార్ నిర్ణయాలు కార్మిక రంగానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని, గుజరాత్లో కార్మిక సంఘాల నిషేధమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని కార్మిక సంఘాల జెండాలు ఎగురవేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం మేడే వేడుకలను వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కార్మికులు, కర్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘాలైన బీఆర్టీయూ, బీఆర్ఎస్కేవీతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. జెండాలు చేతబట్టి కార్మికులు కదం తొక్కారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని కార్మిక సంఘాల జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలుచోట్ల ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు. భానుపురి భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎం ఫంక్షన్‌హాల్, మంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీఆర్టీయూ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ విశ్వమానవ సౌధానికి కార్మికుల త్యాగాలే పునాదులని పేర్కొన్నారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. అసంఘటిత రంగ ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తే ఆ కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారని తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి కోట్లాది నిధులు..
ప్రమాదవశాత్తు మరణించిన 4,001 బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 6 లక్షల చొప్పున 223 కోట్లు అందజేసినట్లు మంత్రి చెప్పారు. అదేవిధంగా అంగవైకల్యం సంభవించిన కుటుంబాలకు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారని తెలిపారు. ఈ తరహాలో ప్రమాదానికి గురైన 504 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 8.9 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మహిళా కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 46,638 మందికి 130 కోట్లు వెచ్చించిందన్నారు. తెలిపారు. అంతేగాకుండా సీఎం కేసీఆర్ మహిళా కార్మికులకు ప్రసూతి ఖర్చుల కింద ఒక్కొక్క మహిళా కార్మికురాలికి 30 వేలు ఇస్తున్నారన్నారు. కార్మికుల కోసం ప్రత్యేకించి పెట్టిన ఖర్చు 1,005 కోట్లని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా కార్మికుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు చేపట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. సూర్యాపేటలో కార్మికుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
కార్మికులకు కేసీఆర్ మేలు చేస్తుంటే.. మోదీ కీడు చేస్తుండు
కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తుంటే.. మోదీ సర్కార్ నిర్ణయాలు కార్మిక రంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్టీయూ అధ్యక్షులు వెంపటి గురూజీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆయా సంఘాల గౌరవాధ్యక్షులు గుడిపూడి వెంకటేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాండన్ సుదర్శన్, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, బాణాల విజయ్, ఆకుల లవకుశలతోపాటు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.