సూర్యాపేట, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చితే.. నేడు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా వదలకుండా, ఇవ్వని హామీలను సైతం చేస్తూ వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి తాజాగా నెల రోజులుగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల కోసం వచ్చే రెగ్యులర్ నిధులకు తోడు సూర్యాపేటలో కలెక్టరేట్, పోలీస్ భవనంతోపాటు మెడికల్ కళాశాల తదితర ప్రారంభోత్సవాలకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే రూ.143.50 కోట్లు విడుదలవడం గమనార్హం. ఇవే కాకుండా సూర్యాపేటలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రూ.517 కోట్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
కొత్త పనులు పూర్తి చేయాలన్న తపనతో..
గత తొమ్మిదేండ్లలో ఎవరూ ఊహించని విధంగా, ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సమయం తక్కువగా ఉండడం.. నిధులు అందుబాటులో ఉండడంతో ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధికి కొనసాగింపుగానే గత ఐదు రోజులుగా వందల కోట్లు వెచ్చించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. గతంలో శంకుస్థాపన చేసిన ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకపోగా నేడు శంకుస్థాపనలు చేస్తున్న పనులను కూడా పూర్తిచేయాలన్న తపనతో ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. మంత్రి పనితీరుపై జనం చర్చించుకుంటూ.. ఇలాంటి నాయకుడిని ఇప్పటి వరకు సూర్యాపేట చరిత్రలో చూడలేదని, మంత్రి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమంటున్నారు. అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రోజు రోజుకూ జోష్ పెరుగుతుండగా, విపక్షాల వెన్నులో వణుకు వస్తుందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఐదు రోజులుగా అలుపెరుగకుండా..
గత ఐదు రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి అలుపు లేకుండా పర్యటిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలో అన్ని కుల, ఉద్యోగ సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేసి అన్నింటికీ స్థలాలు కేటాయించగా స్థలాల విలువతోపాటు నిర్మాణ ఖర్చులు కలుపుకుంటే దాదాపు రూ.100 కోట్లు కేటాయించినట్లే. అలాగే రూ.200 కోట్లతో ప్రభుత్వాసుపత్రి, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి, బతుకమ్మ చీరెల పంపిణీ తదితర కార్యక్రమాలతో రోజులో దాదాపు 18 గంటలు జనంలోనే ఉంటున్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి.