కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డలకు వరం
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ఆత్మకూర్.ఎస్, మే 6 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్మికల్‌లో గల వందన ఫంక్షన్హాల్లో 222మంది లబ్ధిదారులకు 2కోట్ల 22లక్షలా 36వేలా 852 రూపాయల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం అందించి మాట్లాడారు. మండలంలో ఇప్పటి వరకు 1,730మందికి రూ.17.60కోట్ల చెక్కులు అందించినట్లు మంత్రి తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పేదల ఇళ్లలో కాంతులు నింపేలా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంటే మోదీ రాష్ట్రమైన గుజరాత్లో కరెంట్ లేక రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి, తాగడానికి నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమావాస్య చీకట్లలోనూ విద్యుత్ కాంతులు ప్రసరిస్తున్నాయని తెలిపారు. ఇంటింటికీ తాగునీరు, కోటి ఎకరాలకు పైగా సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
తెలంగాణలో అభివృద్ధి అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, ఆర్డీఓ రాజేంద్రకుమార్, తాసీల్దార్ హేమమాలిని, ఎంపీడీఓ మన్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ, ఆర్ఐ అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్ దావీదు, వీరారెడ్డి, ఎంపీటీసీలు ముత్తయ్య, మిర్యాల వెంకట్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ జానయ్య, బెల్లంకొండ యాదగిరి, బ్రహ్మం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.